ఎన్నికలు వస్తున్నాయంటే ఎదుటి పార్టీ నేతల కోసం పార్టీలు గాలం వేయడం సర్వసాధారణం. ఆ పార్టీకి అంగ బలమో.. ఆర్థిక బలమో కాస్తో కూస్తో ఉన్నా కూడా తమకు లాభిస్తుందనే భావనలో ఉంటారు పార్టీల అధినేతలు. ఇక ఇప్పుడు తెలంగాణలో అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకూ ఈ ఎన్నికలు కీలకమే కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే భావనలో ఉంది. పైగా జాతీయ స్థాయి పార్టీ అని భావిస్తోంది కాబట్టి సొంత రాష్ట్రంలోనే గెలిచి తీరాల్సిందే. లేదంటే జాతీయ పార్టీ కల.. కలగానే మిగిలిపోతుంది. దీంతో విజయం కోసం బీఆర్ఎస్ అన్ని అస్త్రాలనూ వాడుకుంటోంది.
అందరితోనూ బీఆర్ఎస్ సంప్రదింపులు..
ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలరే గాలం వేస్తోంది. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీ కండువా కప్పేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు దక్కని, గుర్తింపు లేని నేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాగం జనార్ధన్ రెడ్డి చేరారు. ఇప్పుడు పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి చేరికకు కూడా రంగం సిద్ధమైంది. ఇంకా ప్రస్తుతం అసంతృప్త నేతలందరితోనూ బీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుతోంది. వారందరినీ చేర్చుకుని మరింత స్ట్రాంగ్ కావాలని బీజేపీ భావిస్తోంది.
అలా అనుకోవడం కూడా అమాయకత్వమే..
కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కని నేపథ్యంలో రెబల్‌గా పోటీ చేయలేని నేతలందరికీ బీఆర్ఎస్ పార్టీయే మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. కానీ ఇక్కడ కూడా టికెట్ కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. ఇక్కడికి వచ్చి కూడా ఆయా నేతలు సాధించేదేం లేదు కానీ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడమే చేయగలిగింది. బీఆర్ఎస్ నేతలకు సహకరించి వారి విజయానికి కృషి చేయడం ద్వారా కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలందరికీ బీఆర్ఎస్ ఏం హామీ ఇస్తుందనేది తెలియడం లేదు. ఎన్నికల తర్వాత ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో చూడాలి. వీరికి బీఆర్ఎస్ భవిష్యత్తులో ఏవో పదవులు కట్టబెడుతుందనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎమ్మెల్యేలకే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకే చాలా కష్టం. అలాంటిది వారి గెలుపు కోసం కృషి చేసిన వారికి ఏదో చేస్తుందనుకోవడం ఎంతమేరకు సత్ఫలితాన్నిస్తుందో చూడాలి.