ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. హిందూత్వానికి చాలా దూరం. ఆయన ఫ్యామిలీ మొత్తం ఏసయ్యను నమ్ముకుంది. సరే.. దేవుడు ఎవరైతే ఏంటి? ఎవరు ఎవరినైనా కొలుచుకోవచ్చు. కానీ ఆయన భక్తులు అదేనండి.. వైసీపీ నేతలు ఆయనను శ్రీ మహావిష్ణువుతో ఏకంగా తిరుమల వెంకన్న సాక్షిగా పోలుస్తున్నారు. ఇటు చూస్తే జగన్ ఎక్కడా కూడా హిందూ దేవతల ప్రసాదమే తీసుకోరని టాక్. అటు చూస్తేనేమో ఆ పార్టీ నేతలు హిందూ దేవతలతో పోల్చి మరీ జగన్‌కు భజన చేస్తున్నారు. చూడబోతే వీళ్లంతా మహావిష్ణు అవతారమని గుడి కట్టి జగన్‌కు ఏకంగా పూజలు చేసేలా ఉన్నారు. ఇప్పటికే వీరి భజన దేశ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది.
పలు సందర్భాల్లో వైసీపీ నేతలు క్యూ కట్టి మరీ జగన్ పాదాలకు నమస్కరించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ‘అన్నానికి అరటాకు.. సున్నానికి తంబాకు’ అనే పాటను యాడ్ చేసి మరీ ఈ వీడియోను నెటిజన్లు ట్రోల్ చేశారు. ఆ తరువాత అసెంబ్లీలోనూ భజనను ఆ పార్టీ మహిళా నేతలు వీడలేదు. ఖలేజా మూవీని రిపీట్ చేశారు. ఇక తాజాగా ఎంపీ మార్గాని భరత్.. తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీ ప్రజలకు కొత్త విష్ణుమూర్తి అవతారాన్ని పరిచయం చేశారు. ఆ అవతారం మరెవరో కాదు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి ఆయనను విష్ణుమూర్తి అవతారంగానో.. అంశగానో చెప్పాల్సిన అవసరం ప్రస్తుతం భరత్‌కు ఏమొచ్చిందంటారా? దీనికి కారణం లేకపోలేదు.
టీడీపీ నేతలు తమ పార్టీ అధినేత చంద్రబాబుకి మద్దతుగా ‘జగనాసుర దహనం’ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మా నేతను రాక్షసుడితో పోలుస్తారా? అసలు మా నేత ఎవరనుకుంటున్నారు? జగన్ మోహన్ అంటే సాక్షాత్తు శ్రీ మహా విష్ణుమూర్తి అవతారం, అంశ అంటూ ప్రపంచ కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు మార్గాని భరత్. అసలు జగన్‌ను రాక్షసుడితో పోలుస్తుంటే హిందూ సాంప్రదాయవాదులు ఖండించాలి కదా? అని కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం రేపటి నుంచి చర్చికి ఎలా వెళతారు? ఏసయ్య ఒప్పుకుంటాడా? దేవుళ్ల ఫోటోలే ఉండకూడదంటారే.. మరి ఏకంగా హిందూ దేవుడే చర్చికి వెళితే పరిస్థితేంటి? ఇదంతా పక్కనబెడితే నాలుగేళ్లలో ధ్వంసమైన హిందూ గుళ్ల పరిస్థితేంటి? ఏనాడైనా పెదవి విప్పారా మార్గాని భరత్? లేదంటే మా జగన్ శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయనే చూసుకుంటాడులే అని ఊరుకున్నారా? ఇన్‌స్టా రీల్స్ పైన పెట్టిన ఫోకస్.. దేవుడి గుళ్ల ధ్వంసాన్ని అరికట్టడంపై పెట్టుంటే బాగుండేదని జనం అంటున్నారు.