50 రోజులకి పైగా స్కిల్ డెవెలెప్మెంట్ కేసులో రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్న టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ఈరోజు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. స్కిల్ డెవెలెప్మెంట్ కేసులో జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఆరోగ్యకారణాల రీత్యా బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. చంద్రబాబుకి బెయిల్ రావడమే లోకేష్, బ్రాహ్మణీలు రాజమండ్రి జైలు వద్దకు చేరుకొని చంద్రబాబు తో ములాఖత్ అయ్యారు.
చంద్రాబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడుకి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు నాయుడు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం.. అంటూ సోషల్ మీడియా ద్వారా పవన్ స్పందించారు.
చంద్రబాబు జైలు కి వెళ్ళాక ఆయనతో ములాఖత్ అయ్యి పవన్ కళ్యాణ్ జనసేన-టీడీపీ పొత్తుపై మీడియా ముఖంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన అన్న కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీకి ఫ్యామిలీతో కలిసి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేకపోవడంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు బెయిల్ పై సోషల్ మీడియా ద్వారా స్పందించారు.