ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు బీజేపీలో కల్లోలం రేపుతున్నాయి. చివరకు తండ్రీకొడుకుల మధ్య కూడా విభేదాలు సృష్టిస్తున్నాయి. ఆందోల్ బీజేపీలో కల్లోలం రేపుతోంది. ఆందోల్ బీజేపీ టికెట్ కోసం బాబుమోహన్‌తో పాటు ఆయన కుమారుడు ఉదయ్ బాబు పోటీ పడుతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా బాబూమోహన్ మీడియా ముందుకు వచ్చి.. రకరకాల కామెంట్స్ చేయడం ఆశ్చర్యకరంగా మారింది. తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయనడానికి ఆయన మాటలే నిదర్శనమంటున్నారు. విరిగిన మనసుతోనే ఆయన ఆ స్టేట్‌మెంట్స్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
పోటీ విషయమై ఏం జరిగి ఉంటుంది?
బీజేపీ విడుదల చేయనున్న జాబితాలో తన పేరు ఉన్నా కూడా తాను పోటీ చేయబోనని బాబూ మోహన్ తెలిపారు. మాజీతో పాటు కొత్త అధ్యక్షుడు సైతం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. పార్టీ నుంచి తనకు ఎలాంటి సహకారమూ లేదని బాబూ మోహన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తనను, తన కొడుకును విడదీయాలని చూస్తున్నారని.. అందుకే పోటీ నుంచి తప్పుకోబోతున్నట్టు వెల్లడించారు. మొత్తానికి తండ్రీకొడుకుల మధ్య పోటీ విషయమై ఏదో జరిగి ఉంటుందని.. అందుకే బాబూ మోహన్ అలా మాట్లాడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. బాబూ మోహన్ స్టేట్‌మెంట్‌తో ఇక వివాదం ముగిసినట్టేనని అంతా భావించారు.
తండ్రీకొడుకులిద్దరి పేర్లు లేవు..
అయితే బాబూ మోహన్ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉదయ్ బాబు కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉదయ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీని కాపాడుకుందామంటూ వాట్సాప్ స్టేటస్‌లను ఆయన హోరెత్తిస్తున్నారు. అందరూ కలవాల్సిన సమయం ఆసన్నమైందని.. రామదండు కదలాలంటూ ఉదయ్ తన స్టేటస్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి అసలు తండ్రీకొడుకుల మధ్య ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీ తొలి జాబితాలో మాత్రం బాబు మోహన్, ఆయన కుమారుల పేర్లు అయితే లేవు. రెండో జాబితాలో మాత్రం ఉదయ్ పేరు కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..