ఏపీలో సంక్షేమ పథకాలు తప్ప.. అభివృద్ధి వీసమెత్తైనా కనిపించదు. జగన్ ప్రభుత్వం వచ్చాక రాజధాని అనేదే లేదు.. రాళ్లు తప్ప. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అభివృద్ధి శూన్యం. తెలంగాణలోనే కాదు.. ప్రతి రాష్ట్రంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తారు. దీంతోపాటే అభివృద్ధి కూడా స్పష్టంగానే కనిపిస్తుంది. కానీ ఏపీలో సంక్షేమ పథకాలను దాదాపు నూరు శాతం అమలు చేశామని.. నిరుపేదల బతుకులను మార్చేశామని.. జగన్‌తో పాటు పార్టీ నేతలంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి సంక్షేమ పథకాలే నిరుపేదల బతుకును మార్చేస్తాయా? లేదంటే జగన్ ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు సంక్షేమ పథకాలు నిరుపేదల బతుకులను మార్చేస్తే.. ఇక వాళ్లు ఉండరు కదా? అలాంటప్పుడు సంక్షేమ పథకాలను కొనసాగించడం ఎందుకు? ఎవరిని బాగు చేయడానికనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
సంక్షేమంతో పాటే అభివృద్ధి..
దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా నాలుగున్నరేళ్లలో ప్రజలను ఉద్దరించడం నిజమైతే ప్రశంసించాల్సిందే. అంతేకాదు.. దేశం మొత్తం అమలు చేయాలని కూడా సజెస్ట్ చేయాల్సిందే. కానీ మళ్లీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వైసీపీ చెబుతుండటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అభివృద్ధి లేదు.. సంక్షేమ పథకాల వలన జనాన్ని సోమరిపోతుల్ని చేయడం తప్ప ఉపయోగం లేదు. ఇంక వైసీపీ ఈ ఐదేళ్లలో ఏం చేసిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఏకకాలంలో చేస్తూ పోతోంది. దాని కోసం అప్పులు చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాల కోసమే లక్షల కోట్లు అప్పులు తెస్తోంది.
వైసీపీ విధానం తప్పంటున్న పీకే..
మరి ఈ అప్పులన్నీ తీరేదెలా? అన్ని రంగాలనూ అభివృద్ధి చేసుకుంటూ సంపద సృష్టించుకుందామనే ఆలోచనే కనీసం జగన్ ప్రభుత్వానికి లేదు. ఏపీని అనుసరిస్తే.. ఏ రాష్ట్రమైనా దివాళా తీయడం ఖాయమని అంతా అంటున్నారు. దేశమంతా ఏపీని గుణపాఠంలా తీసుకుని సంక్షేమాన్నే అమలు చేసి దివాళా తీయవద్దని జగన్ ప్రభుత్వానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం సూచించడం విశేషం. వైసీపీ విధానం తప్పని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సంపద సృష్టించి దానిని పేదలకు పంచాలి. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్నది కూడా అదే. ఇక ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం సంక్షేమాన్ని కావల్సిన మేరకు చేసి.. అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుందని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.