గత రెండు ఎన్నికలు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్టుగా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. గతంలో మాదిరిగా ఈసారి ఎన్నికలు సునాయాసంగా గెలవడం చాలా కష్టం. ప్రగతి భవన్‌లో కూర్చొని చక్రం తిప్పుతానంటే గులాబీ బాస్ ఇక దానికే పరిమితమవ్వాల్సి వస్తుంది. కాళ్లకున్న చక్రాలు అరిగేలా తిరిగితేనే విజయం సాధ్యమవుతుంది. అందుకే కేసీఆర్ ప్రగతి భవన్ వీడి జిల్లాల బాట పట్టారు. గతానికి భిన్నంగా ఆయన చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా తయారయ్యాయి. గత ఎన్నికల్లో కేసీఆర్ నామినేషన్ల ఘట్టం పూర్తయ్యే వరకూ కూడా ప్రజా క్షేత్రం వైపు తొంగి చూసేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్.
టీడీపీ గెలవడమే..
అప్పట్లో కేసీఆర్ కొన్ని జిల్లాలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. 2014 ఎన్నికల్లో అంటే అప్పుడే తెలంగాణ రావడం.. దానిని ఆయుధంగా మార్చుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో మరోసారి ప్రాంతీయాభిమానాన్ని వాడుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ తోడవడం బీఆర్ఎస్‌కు ప్లస్‌గా మారింది. కాంగ్రెస్ గెలవడమంటే టీడీపీ గెలవడమేనని.. ఆంధ్రోళ్ల పాలన అవసరమా? అంటూ ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికల్లో సునాయాసంగానే గెలిచింది. కానీ పరిస్థితులు ఇప్పుడు అలా లేవు. కాంగ్రెస్ పార్టీ బీభత్సంగా పుంజుకుని బీఆర్ఎస్‌కు సవాల్ విసురుతోంది.
కావల్సినన్ని అస్త్రాలు..
అధికారాన్ని వదులుకునేందుకు ఏ పార్టీ అయినా ఎందుకు ఇష్టపడుతుంది? నయానో భయానో చేజిక్కించుకునేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. వయసును కూడా లెక్క చేయకుండా ఉదయం, సాయంత్రం సభలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. నిజానికి 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సమర్థనీయమైన ప్రత్యర్థి లేడు. కానీ ఇప్పుడు పోటీ పెద్ద ఎత్తున ఉంది. ఇక ప్రత్యర్థి పార్టీల చేతిలో అస్త్రాలు కావల్సినన్ని ఉన్నాయి. మరోవైపు విద్యార్థులు, ఉద్యోగుల అండ కూడా లేదు. ఇది చాలదన్నట్టు బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఉండాలంటే రెండు నుంచి మూడు రాష్ట్రాల్లో పోటీ చేయాలి. సొంత రాష్ట్రంలోనే గెలవకుంటే పరిస్థితి ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు ఆ పార్టీకి చాలా కీలకం. మరి కేసీఆర్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందో లేక ఫలిస్తుందో చూడాలి.