టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి విషయమై ఆందోళన మరింత వ్యక్తమవుతోంది. జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పటి నుంచే చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి సైతం పలు సందర్భాల్లో తన తండ్రికి ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు స్వయంగా చంద్రబాబే తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనంగా మారింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు భద్రత గురించి మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.
విషం కలిపి చంపేసినా ఆశ్చర్యం లేదు..
“2024లో చంద్రబాబు చావు.. జగన్ అధికారంలోకి రావడం ఖాయం’’ అని గోరంట్ల మాధవ్ అన్నారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా చంద్రబాబును చంపాలనుకుంటే అదో పెద్ద లెక్కేమీ కాదని.. ఎప్పుడో చంపేవారమని వైసీపీ నేత అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు కుటుంబ సభ్యులే ఆయనకు పంపించే భోజనంలోనే విషం కలిపి చంపేసి తమపై నెట్టినా ఆశ్చర్యం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పదే పదే చంద్రబాబు చావు గురించి మాట్లాడటం ఆందోళన కలిగిస్తోంది. వారి మనసులో ఏదో దురాలోచన ఉండబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
టీడీపీ నేతల ఆందోళనను కొట్టిపడేయలేం..
2019 ఎన్నికల్లో అధికారం కోసం బాబాయిని చంపిన చరిత్ర వైసీపీ అధిష్టానానిదని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి టీడీపీ నేతల ఆందోళనను సైతం కొట్టిపడేయలేం. ఏదో రాజకీయాల కోసం చేస్తున్న హంగామాగా కూడా చూడలేం. చంద్రబాబు నాయుడికి కేంద్రం జడ్ ప్లస్ భద్రతను కేటాయించింది. కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకు కనీస భద్రత లేదు. ఏం చేసినా అడిగే దిక్కు కూడా లేదు. దీంతో చంద్రబాబు స్వయంగా తనకు భద్రత లేదని కోర్టుకు తెలిపారు. అసలు చంద్రబాబును జైల్లో పెట్టిన నాటి నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతున్నా వైసీపీ ప్రభుత్వం మాత్రం స్పందించిన పాపాన పోవడం లేదు.