సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఇప్పుడు పాలిటిక్స్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే ఆశ్చర్యకరంగానూ.. చర్చనీయాంశంగానూ మారాయి. ఇంతకీ జేడీ ఏం చేశారంటారా? వైసీపీని పొగిడారు. నేటి వరకూ ఆయన చేయని పనిని తాజాగా చేయడంతో అంతా అవాక్కవుతున్నారు. ఏపీలో విద్యా, వైద్య రంగంలో గణనీయమైన మార్పులు వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చాయని ఆయన అన్నారు. ఆయన నోట ఈ మాట రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీని పొగడటం వెనుక కారణం ఏముంటుందా? అన్న ఆరాలు జనం తీస్తున్నారు.
అంతరార్థాలు వెతకాల్సి వస్తోంది..
జేడీ విమర్శలు నిర్మాణాత్మకంగానే చేస్తారు. అప్పట్లో అభివృద్ధిని అన్ని వైపులా విస్తరించాలని ఏపీ పాలన వికేంద్రీకరణ విషయంలో సూచనలు చేశారు. అయితే తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పుడో చేసి ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఆయన మేధావి వర్గానికి చెందిన వారు కాబట్టి ప్రజోపయోగమే ఉంటుందని భావించేవారు. ఎన్నికల సమయంలో చేశారు కాబట్టి కాస్త సూక్ష్మంగా ఆలోచించాల్సి వస్తోంది. జేడీ మాటల వెనుక అంతరార్థాలు వెతకాల్సి వస్తోంది. అంతేకాకుండా వైద్యరంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ఆయన వైసీపీ సభలో మెచ్చుకున్నారు. దీని అర్థమేమి.. తిరుమలేశా? అని జనం తలలు పట్టుకుంటున్నారు. మీరు మారిపోయారు జేడీ సర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
సీటు కోసం గాలం వేస్తున్నారా?
అయితే కొంత మంది జేడీ వ్యాఖ్యలకు అర్థాన్ని వెతికి తీశారు. జేడీ విశాఖ నుంచి ఎంపీగా ఈ సారి పోటీ చేసి తీరుతాను అని ఇప్పటికి అనేకసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల్లో ఎవరో ఒకరికి ఎంపీ సీటు కేటాయిస్తారు. ఇక బీజేపీ సెపరేటుగా పోటీ చేసినా లేదంటే పొత్తులో ఉన్నా కూడా విశాఖలో అభ్యర్థులకు లోటు లేదు. ఇక వైసీపీ నుంచి మాత్రం అవకాశం ఉంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అయితే బాగుంటుందని వైసీపీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే జేడీకి అయితే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఆయనకు ఆహ్వానం కూడా ఉందని టాక్. ఈ క్రమంలోనే జేడీ విశాఖ వైసీపీ ఎంపీ సీటు కోసం గాలం వేస్తున్నారని కొందరు అంటున్నారు. మరి చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో.