గత ఏడాది సెప్టెంబర్ లో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవిని, తండ్రి కృష్ణగారిని వరసగా కోల్పోయాడు. గత ఏడాది జనవరిలో అన్న రమేష్ బాబు ని కోల్పోయిన మహేష్ అదే ఏడాది తల్లిని, తండ్రిని నెలన్నర గ్యాప్ లో పోగొట్టుకున్నారు. మహేష్ తల్లీ, తండ్రీ చనిపోయి ఏడాది పూర్తయ్యింది. అయితే మహేష్ బాబు తన తల్లి కోరిక తీర్చేందుకు తన ఇంట్లో శుభ కార్యం ప్లాన్ చేసుకున్నాడట. ఆయన తల్లి ఇందిరాదేవి బ్రతికున్నప్పుడే మనవరాలు హాఫ్ సారీ ఫంక్షన్ చూడాలనుకున్నారట.
కానీ ఆమె అకాల మరణంతో ఆ కోరికని మహేష్ తీర్చలేకపోయాడట. ఇప్పుడు తల్లితండ్రుల ఏడాది మాసికాలు పూర్తి కావడంతో మహేష్ బాబు తల్లి కోరిక మేరకు తన కుమార్తె సితారకి ఓణీల ఫంక్షన్ నిర్వహించబోతున్నాడట. ఈ వేడుకకి సినీ, రాజకీయ ప్రముఖులకి ఆహ్వానాలు పంపకపోయినా.. ఘట్టమనేని ఫ్యామిలీ, ఇంకా మహేష్ అక్కా చెల్లెళ్ళ మధ్యలో తన ఇంట్లోనే గ్రాండ్ గా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. మరి మహేష్ కుమార్తె సితార ఇప్పుడు పెద్ద సెలెబ్రటీ.
ఆ పాప 11 ఏళ్లకే పెద్ద పెద్ద యాడ్స్ లో కనిపిస్తూ తాను సంపాదించిన డబ్బుని సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తూ ఉదారత చాటుకుంటుంది. మహేష్ కూడా తన భార్య పిల్లలతో విదేశీ ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉంటున్న మహేష్ త్వరలోనే తన ఇంట శుభకార్యం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.