వైసీపీ ప్రభుత్వం ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని మంచి చేసుకుంటూ పోతోంది. సంక్షేమ పథకాలనే ఆసరాగా చేసుకుని అధికారంలోకి రావాలని మొన్నటి వరకూ వైసీపీ అధినేత జగన్ భావించారు. కానీ ప్రభుత్వంపై వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి.. ఆ పార్టీకి అవినీతి మరకను అంటించి ఈసారి తిరిగి ప్రభుత్వంలోకి రావాలని భావిస్తోంది. మరోవైపు ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉండగానే జనాల్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు.
అదే శాపంగా మారుతుందా?
ఇప్పటికే ‘సామాజిక సాధికార యాత్ర’ వైసీపీ బస్సు యాత్రలు చేపట్టింది. ఇక చంద్రబాబు, ఆయన తనయుడిపై అయితే వరుసబెట్టి కేసుల మీద కేసులు వేస్తూనే ఉంది. చంద్రబాబును జైలుకు పంపించిన వెంటనే పండగ చేసుకుంది. కానీ చంద్రబాబు పట్ల సింపతి పెరగడంతో పాటు.. జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో ఒక్కసారిగా వైసీపీ ఖంగు తిన్నది. అదే తమకు శాపంగా మారుతుందని భయపడుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ మరో అడుగు ముందుకు వేసింది. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ప్రజల మధ్యకు పంపించింది.
వర్కవుట్ కాలే..
ఎప్పుడూ రాజకీయాల్లో వేలు పెట్టని మహిళ.. అలా ప్రజల మధ్యకు రావడంతో సింపతి బీభత్సంగా పెరుగుతుందేమోనన్న భయం వైసీపీలో పెరిగినట్టుంది. ఈ భయాందోళనల నడుమే మంత్రులను బస్సు యాత్రలకు పురిగొల్పింది పార్టీ అధిష్టానం. ఒకానొక సమయంలో వైసీపీ అధినేత ఓ సభను ఏర్పాటు చేసి మరీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో తనకు ఏ పాపం తెలియదని.. అప్పుడు తాను దేశంలోనే లేనని నమ్మబలికే యత్నం చేశారు. అయినా కూడా అది వర్కవుట్ కాలేదు. జగన్‌కు తెలియకుండా ఇదంతా జరిగిందంటే ఎవరు నమ్ముతారు? కనీసం మంత్రులు కూడా బస్సుల యాత్రల పేరుతో జనాల్లోకి వెళుతున్నారే కానీ.. తాము చేసిన ఈ పని చూసి ఓటేయండని ధైర్యంగా అడగలేకపోతున్నారు. మొత్తానికి వైసీపీలో అయితే భయం మొదలైందనడంలో సందేహం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.