తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇంకో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ సిత్ర విచిత్రాలు కనిపించాయంటే ఓకే.. కానీ ఏపీలో ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇప్పుడే వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో కనిపించే సిత్రాలన్నీ ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ నేతలంతా ఎక్కడ లేని ప్రేమ కనబరుస్తుంటారు. నీళ్లు కావాలంటే నీళ్లు.. పాలు కావాలంటే పాలు క్షణాల్లో సప్లై చేసేస్తారు. మనకు కష్టం వస్తే మనకంటే ఎక్కువ వాళ్లు కన్నీరు పెడతారు. మన ఆకలిని తెలుసుకుని మనకు కూరగాయలు కాదు.. ఏకంగా చికెనే సప్లై చేస్తారు.
బహుమతులతో వల వేస్తున్న నేతలు..
నిజానికి ఇది ఎన్నికల సమయంలో ఏ రాష్ట్రంలో అయినా కనిపించే తంతే కానీ.. ఏపీలో కాస్త ముందుగానే కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలకు ఏడు నెలల సమయం అయితే ఉంది. నెల ముందు నుంచి మనం పైన చెప్పుకున్నా సిత్రాలన్నీ కనిపిస్తుంటాయి కానీ ఏడు నెలల ముందు మనం చూడలేం. మరి ఈాసారి ఎన్నికలు చాలా టఫ్ అనుకున్నారో ఏమో కానీ వైసీపీ నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. జనానికి ఇప్పుడే బహుమతులతో వల వేస్తున్నారు. తాజాగా విశాఖలో ఓ నేత దసరాకు జనానికి పంచిన గిఫ్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దసరాకు గిఫ్ట్‌లు ఇవ్వడం కామనేగా అంటారా? రొటీన్‌గా గిఫ్ట్స్ ఇస్తే ఓకే.
కోడి.. క్వార్టర్..
స్వీట్ బాక్సులివ్వడం వరకూ ఓకే కానీ అవి ఇస్తే ఎవరు గుర్తుంచుకుంటారు అనుకున్నారో ఏమో కానీ ఒక కేజీ కోడి.. క్వార్టర్ మందు బాటిల్ ఇచ్చి బీభత్సంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ నేత ఎవరంటారా? విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకుడు బాపూ ఆనంద్. ఈయన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు ప్రధాన అనుచరుడు కూడా కావడం గమనార్హం. అసలు కోడి, మందు పంపిణీ సమయంలో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మొత్తం 122 మందికి పంపిణీ చేసి తానొక శిబి చక్రవర్తిలా ఫీల్ అయ్యారు. ఇక పంచిపెట్టిందంతా ఆనంద్ వర్గీయులకే కావడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో సెటైర్లు హోరెత్తిపోతున్నాయి. ఏమైనా తాయిలాలా? వండర్ చేశారుగా అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.