టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టారు. 50 రోజులకు పైబడి ఆయన జైల్లోనే ఉంటూ వస్తున్నారు. 70 ఏళ్లు పైబడిన వ్యక్తిని ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ప్రజల్లోనూ కావల్సినంత సింపతి వచ్చేసింది. ఇక కుటుంబ పెద్ద ఇంటికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు ఎక్కువ లోటు ఫీలవుతారు? ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చేసి న్యాయపరమైన వ్యవహారాలు, కార్యకర్తలతో మమేకం కావడం, పార్టీ నేతలతో ప్రస్తుత పరిణామాలపై చర్చించడం.. పార్టీని ముందుకు నడిపించడం వంటి అంశాలు చూస్తున్నారు.
బయటకు వెళ్లాల్సిందెవరు?
ఇక ఉన్నది చంద్రబాబు సతీమణి, కోడలు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి. వీరిద్దరిలో ఇంటి పట్టున ఉంటూ తన కుమారుడి వ్యవహారాలతో పాటు ఇంటి వ్యవహారాలను అలాగే పార్టీ వ్యహారాలను బ్రాహ్మణి చూసుకుంటున్నారు. ఇక మిగిలింది నారా భువనేశ్వరి. భార్యగా ఆమె అత్యంత బాధితురాలు. భర్తను జైలులో పెట్టి 50 రోజులు అవుతోంది. ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ఈ తరుణంలో న్యాయం కోసం బయటకు వెళ్లాల్సింది ఎవరు? భువనేశ్వరి కాదా? దీనికెందుకు ఇంత రాద్ధాంతం? నిజం గెలవాలని ఆమె కోరుకోవడంలో తప్పేముంది? పెద్దావిడను బయటకు పంపారంటూ లేనిపోని సానుభూతి వచనాలెందుకు? అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టేటప్పుడు పెద్దావిడ గుర్తుకురాలేదా? అని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
విజయమ్మ జనాల్లోకి వెళ్లలేదా?
భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో లోకేశ్ కూడా బస్సుయాత్ర చేయనున్నారు. అయినా సరే.. వైసీపీ నేతలు, పార్టీకి మద్దతుగా నిలుస్తున్న మీడియా సంస్థలు తమకేదో అన్యాయం జరిగిపోతోందన్నంతగా గగ్గోలు పెడుతున్నాయి. భువనేశ్వరి జనాల్లోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇక బూతులు మంత్రిగా పేరుగాంచిన వారైతే.. లోకేష్ సమర్థుడైతే తల్లిని ఎందుకు రోడ్డెక్కిస్తారంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి జైలు పాలైనప్పుడు ఆయన తల్లి విజయమ్మ జనాల్లోకి వెళ్లలేదా? ఎక్కడ భువనేశ్వరి జనాల్లోకి వెళితే సింపతీ బీభత్సంగా వర్కవుట్ అయి.. ఎక్కడలేని మైలేజ్ వస్తుందని వైసీపీనేతలు ఆందోళన చెందుతున్నట్టు వారి మాట్ల ద్వారానే స్పష్టమవుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇలా విమర్శలు గుప్పిస్తూ జనాల్లో మరింత చులకన అవ్వొద్దని రాజకీయ విశ్లేషకులు సైతం హితవు పలుకుతున్నారు.