తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలోనే సర్వేలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ప్రస్తుతం సర్వేలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఓటరు మైండ్ సెట్‌ను మార్చేందుకు పార్టీలన్నీ సర్వేలను కూడా ఒక అస్త్రంగా వినియోగించుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో తలపడబోతున్నాయి. బీజేపీ ఉన్నా మూడో స్థానానికి పడిపోయింది కాబట్టి పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి అనుకూల సర్వే వారు చేయించుకుని దానికనుగుణంలో తమకు సపోర్ట్‌గా నిలిచే మీడియా సంస్థలను సిద్ధం చేసుకుని మరీ సర్వేలను రిలీజ్ చేస్తున్నాయి.
వాట్సాప్‌లో రోజుకో సర్వే..
ఇటు సర్వే విడుదలైందో లేదో అటు మీడియా ఛానల్స్ తమ వంతుగా చర్చలు నిర్వహించి మరీ జనాల మెదళ్లలోకి ఫలానా పార్టీ గెలుస్తుందనే అభిప్రాయాన్ని నిక్షిప్తం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇక ఈ సర్వేలను జనంలోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. వాట్సాప్‌లో రోజుకో సర్వే వస్తోంది. ఇలా రోజుకో సర్వేను చూస్తున్న జనం ఏది నిజమో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉండిపోతున్నారు. ఇండియా టుడే ఛానల్ సీ ఓటర్‌తో కలిసి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఒక రోజు కూడా గడవక ముందే ఇండియా టీవీలో అందుకు భిన్నమైన సర్వే వెలువడింది. నిజానికి ఈ రెండు సర్వేలు పూర్తి భిన్నంగా ఎందుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది..
ఇక ఛానళ్లలో సర్వేల వార్ జరుగుతోంది. ఒక పార్టీ గెలుస్తుందని.. దాని అనుకూల మీడియా వార్తల మీద వార్తలు వెలువరిస్తుంటే.. దాని వ్యతిరేక మీడియా సంస్థ మాత్రం అదంతా బోగస్ అని చెప్పేందుకు ట్రై చేస్తోంది. ఇక సర్వేల విషయంలో అయితే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీయే దూసుకెళుతోంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తన సర్వేల వ్యూహంతో బీభత్సంగా ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా తటస్థ ఓటరు మైండ్ సెట్‌ను మార్చడంలో ఈ సర్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇక ఈ సర్వేలను బేస్ చేసుకుని పందాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక చూడాలి రానున్న ఎన్నికల్లో గెలుపు ఫ్యాక్టర్‌ను ఈ సర్వేలు ఎంత మేర డిసైడ్ చేస్తాయో.