టీడీపీ-జనసేన కలిసి పక్కా ప్రణాళికతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నాయి. ఇక నుంచి కార్యక్రమం ఏదైనా కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. కూటమి విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇరు పార్టీల కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నాయి. సమావేశాలు నిర్వహించి మరీ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వస్తున్నాయి. నవంబర్ 1 నుంచి వైసీపీ అంతమే లక్ష్యంగా జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఏపీలో ఓట్ల తొలగింపు పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై ముందుగా తమ గళాన్ని వినిపించాలని భావిస్తున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు.
టీడీపీ-జనసేన రావాలి.. వైసీపీ పోవాలి..
‘నిజం గెలవాలి’ అన్న పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడితే టీడీపీ - జనసేనలు సంయుక్తంగా 100 రోజుల ప్రణాళికలు రచించాయి. ‘టీడీపీ-జనసేన రావాలి.. వైసీపీ పోవాలి’ అనే పేరుతో జనంలోకి వెళ్లేందుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అలాగని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమీ ఎన్డీయేకు దూరంగా వెళ్లడం లేదు. దానిలో భాగస్వామిగా ఉంటూనే టీడీపీతో పొత్తులో ఉంటుందని ప్రకటించారు. దీంతో ఎన్నికల సమయానికి బీజేపీ కూడా కూటమితో కలిసి వస్తుందని టాక్ నడుస్తోంది. అయితే తాజాగా జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీలో ముఖ్యంగా మూడు తీర్మానాలు చేశారు. అవేంటనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆందోళన చెందుతున్న వైసీపీ..
అన్ని వర్గాలకు అభివృద్ది అందించడం, వైసీపీ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడం, చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసన తెలపడం వంటి మూడు తీర్మానాలను జాయింట్ యాక్షన్ కమిటీలో చేయడం జరిగిందని తెలుస్తోంది. ఒకవైపు ప్రజాక్షేత్రంలో వైసీపీ అవినీతిని, వైఫల్యాలను ఎండగడుతూనే.. ఇరు పార్టీలు సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి పొత్తుపై వైసీపీ బీభత్సంగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ పొత్తుతో తమకు వచ్చే నష్టం లేదని పైకి చెబుతున్నా కూడా లోలోపల ఆందోళన అయితే చెందుతున్నాయి. కూటమి కంటే ముందే జనంలోకి వెళ్లాలని పరుగులు తీస్తోంది. ఈ క్రమంలోనే వీరికంటే ముందుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. సామాజిక సాధికారత పేరుతో బస్సు యాత్ర చేపట్టనుంది. మరి ప్రజలు ఎవరివైపు నిలుస్తారో చూడాలి.