ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలి. హ్యాట్రిక్ సీఎం అవ్వాలి. తెలంగాణపై ఆధిపత్యాన్ని చేజార్చుకోవద్దు.. ఇవే లక్ష్యంగా గులాబీ బాస్ అడుగులు వేస్తున్నారు. హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో అవలంభించిన వ్యూహానికి మరోసారి పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి మునుగోడు ఉపఎన్నికను అసెంబ్లీ ఎన్నికలకు సెమీస్‌గా బీఆర్ఎస్, బీజేపీ భావించాయి. ఈ క్రమంలోనే అధికారాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాయి.కానీ సీఎం కేసీఆర్ రాజకీయ చాణక్యుడు కావడంతో విజయం బీఆర్ఎస్‌ను వరించింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని టాక్. వార్డు నుంచి నియోజకవర్గం వరకూ ఇన్‌చార్జులను నియమించింది. అంతే కాదు.. ప్రతి 100 మంది ఓటర్లకూ ఒక ఇన్‌చార్జ్‌ను బీఆర్ఎస్ మునుగోడు ఎన్నికల్లో నియమించింది.
బీఆర్ఎస్‌కు తగ్గనున్న సీట్లు..
ఓటు మిస్సవకుండా తాయిలాలు పంచింది. మొత్తానికి బీఆర్ఎస్ మునుగోడు మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఇలాగే ఎక్కడికక్కడ ఇన్‌చార్జులను బీఆర్ఎస్ అధిష్టానం నియమించనుంది. ప్రజాప్రతినిధులందరినీ నియోజకవర్గాలపై మోహరించనుంది. ఓటర్ల చుట్టూ పెద్ద కంచెను వేయనుంది. సర్వేలన్నీ బీఆర్ఎస్‌కు సీట్లు తగ్గుతాయని చెబుతుండటంతో పార్టీ నయానో భయానో ఓటర్లను తమ పిడికిలిలో బంధించాలని చూస్తోంది. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టనున్నారు. కరీంనగర్, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సీట్లు తగ్గుతాయని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. వీటిపై దృష్టి సారించి సీట్లు ఎక్కువగా సాధించేలా ప్లాన్ చేస్తున్నారు.
విభేదాలను ప్రజల్లోకి..
ఇక కాంగ్రెస్ పార్టీ తిరుగుబాట్లను కూడా క్యాష్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని నేతలకు వల వేస్తోంది. ఒకవేళ వాళ్లు రెబల్ అభ్యర్థులుా నామినేషన్స్ వేసినా కూడా తమకు కలిసొస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఒకవేళ రెబల్ అభ్యర్థి గెలిచినా కూడా ఆ తర్వాత వారిని తమ పార్టీలోకి లాగాలని అనుకుంటున్నారట. అలాగే కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలా ఉన్న స్థానాలపై కూడా గులాబీ పార్టీ ఫోకస్ పెడుతోంది. కాంగ్రెస్ పార్టీలోని విభేదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే.. తమ పార్టీ నుంచి జంపింగ్స్‌ను అరిక్టడం బీఆర్ఎస్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటికే వెళ్లిపోయిన నేతలంతా పెద్ద ఎత్తున జనాదరణ కలిగిన నేతలే కావడంతో పార్టీ ఆందోళన చెందుతోంది. మొత్తానికి మ్యాజిక్ మార్క్ దాటేలా గులాబీ బాస్ అస్త్ర శస్త్రాలన్నీ వినియోగిస్తున్నారు.