ఇటీవలి కాలంలో బీఆర్ఎస్‌కి పెద్ద చిక్కే వచ్చిపడింది. కారు గుర్తును పోలిన గుర్తులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. అసలే జాతీయ పార్టీగా అవతరించిన తరుణంలో ఈ గుర్తులతో లేనిపోేని తలనొప్పని భావించిన గులాబీ బాస్ ఆ గుర్తులను తొలగించాలంటూ కోర్టుకెక్కారు. కానీ అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. చివరకు నయానో భయానో పార్టీని కేసీఆర్ ఒప్పించుకున్నారు. రోడ్డు రోలర్ గుర్తుతో బీఆర్ఎస్‌కు సింబల్ చిక్కులు తొలగిపోయాయి. యుగ తులసి పార్టీకి ఈసీ రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. ఆ పార్టీ చీఫ్ శివకుమార్‌ను ఇటీవల ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మరీ మాట్లాడారు. కామన్ సింబల్ను నిలబెట్టుకోడానికి 5% ఓట్లు, సీట్ల కోసం నామమాత్రంగా పోటీ చేయడానికి మాత్రమే యుగతులసి పార్టీ పరిమితమయ్యేలా ఒప్పించారు.
పెద్ద నజరానే ఇచ్చారు..
గతంలో మాదిరిగా భారీ స్థాయి విజయం మాట అటుంచితే.. కనీసం గెలుస్తామనే ఆశలు బీఆర్ఎస్‌లో సన్నగిల్లినట్టున్నాయి. దీంతో ఎలాంటి చిక్కులు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే రోడ్డు రోలర్ గుర్తుతో ఎదురయ్యే చిక్కులను తొలగించుకోవడానికి కేసీఆర్ రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. యుగతులసి పార్టీ చీఫ్‌ను ఒప్పించేందుకు కేసీఆర్ పెద్ద నజరానానే ఇచ్చారు. వెయ్యి ఎకరాలను యుగతులసి ఫౌండేషన్ గోశాల అవసరాల కోసం ఉచితంగానో లేదంటే నామమాత్రపు ధరకో ఇచ్చేలా కొన్ని ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. మొత్తంగా 1,005, 30 ఎకరాల భూమిని గోశాల కోసం ఇవ్వాలన్న ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించినట్లు సమాచారం. మొత్తానికి కేసీఆర్‌కు పెద్ద టెన్షనే తప్పింది.
అక్కడ మాత్రమే పోటీ..
ఈ క్రమంలోనే గో రక్షణ కోసం నిర్దిష్టమైన పాలసీ తీసుకువచ్చేందుకు సైతం కేసీఆర్ అంగీకరించినట్టు సమాచారం. దీంతో గుర్తుతో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు దెబ్బతినకుండా హిందువులను ఆకర్షించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా హిందూ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే యుగతులసి పార్టీ పోటీ చేసేలా శివకుమార్‌ను కేసీఆర్ ఒప్పించినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 291 ఎకరాలు, మరో సర్వే నంబర్‌లో 208 ఎకరాలు, మరో సర్వే నంబర్‌లో 160 ఎకరాలు, మరో సర్వే నంబర్‌లో 284 ఎకరాలు, తక్కెళ్లపల్లిలో 62.30 ఎకరాల భూమి కోసం శివకుమార్ చేసిన ప్రతిపాదనలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.