తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోనుందా..? మరో టీడీపీ కానుందా..? ఉవ్వెత్తున ఎగిసిపడి, విరబూసిన కమలం ఎన్నికలకు ముందు వాడిపోతోందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. వాస్తవానికి బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయన హయంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఉపఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. ఎక్కడో అగాథంలో ఉన్న పార్టీని బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌కు బండి తీసుకొచ్చారు. ఇదికేవలం సంజయ్ వల్లే సాధ్యమైంది.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యమే!. సీన్ కట్ చేస్తే కిషన్ రెడ్డిని కొత్త అధ్యక్షుడిగా నియమించిన ఢమాల్ అని పార్టీ గ్రాఫ్ పడిపోయింది. దీంతో నేతల్లో లేనిపోని అసంతృప్తి, గ్రూపులుగా కమలనాథులు విడిపోవడం, కొట్టుకోవడం, పార్టీకి రాజీనామా చేసి బయటికొచ్చేయడం.. ఇంకొందరు అసంతృప్తి లాగిస్తున్నారు.
అట్టర్ ప్లాప్!
సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రావడం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే చివరిన బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఇదే ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు రగిలిస్తోంది. టికెట్ ఆశించిన, పార్టీకి దశాబ్ధం నుంచి సేవలందించిన చాలా మంది నేతలకు టికెట్లు రాలేదు. దీంతో ఆ నేతలంతా తిరుగుబావుటా వేస్తున్నారు. కొందరు ఆవేదన లోనై మీడియా ముందే ఏడ్చేయగా.. ఇంకొందరు చేసేదేమీ లేక వేరే పార్టీలోకి వెళ్లలేక అడ్జస్ట్ అయిపోతున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలు.. టికెట్ల వ్యవహారం పెను సంచలనమే సృష్టిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. ఏ పార్టీ అయినా తొలి జాబితాలు ముఖ్యులు, సీనియర్ నేతల పేర్లతో రిలీజ్ చేస్తుంది కానీ.. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఈ విషయంలో అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఒకరు కాదు.. ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, సీనియర్లు అలకపాన్పు ఎక్కుతున్నారు. బహుశా ఈ అలక, అసంతృప్తితో ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బే పడేట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదీ పరిస్థితి..!
మొదటి జాబితాలో తమ పేరు వస్తుందని.. సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే.. పేరే కాదు ఆ నియోజకవర్గమే ఎక్కడా కనిపించలేదు. దీంతో అసలేం జరుగుతోంది..? అసలు తాను పార్టీలో ఉన్నానా లేదా..? టికెట్ ఇస్తున్నారా లేదా అని కిషన్ రెడ్డితోనే అమితుమీ తేల్చుకున్నారని టాక్. ఇక పటాన్‌చెరు టికెట్‌ను నందీశ్వర్ గౌడ్‌కు కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అభ్యర్థిని మార్చి వేరొకరికి టికెట్ఇవ్వపోతే పోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని అధిష్టానానికి నియోజకవర్గ నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఇలా ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో నేతల పరిస్థితి ఇలానే ఉంది. వరంగల్ వెస్ట్ స్థానాన్ని ఆశించిన రాకేష్‌కు టికెట్ రాలేదు. కాంగ్రెస్ నుంచి రామారావ్ పటేల్.. ఈ మధ్యే బీజేపీలో చేరగా ఆయనకే టికెట్ వచ్చింది. దీంతో ఆ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రమాదేవి కన్నీరుమున్నీరయ్యారు. నర్సాపూర్, రామగుండం, ఆదిలాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. ఆదిలాబాద్ టికెట్ పాయల్ శంకర్‌కు ఇవ్వడంపై సేమ్ సీన్. అయితే.. ఇన్నిరోజులుగా నాన్చి.. నాన్చి చివరికి ఫైర్ బ్రాండ్ రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు ఎత్తేసిన అధిష్టానం ఈసారి మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. దీంతో టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విక్రమ్ గౌడ్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. వేరొక చోట ఇస్తామని చెప్పినప్పటికీ యువనేత అసంతృప్తితో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ వరుస పరిణామాలతో బీజేపీ ఈసారి అనుకున్న సీట్లు కాదు కదా.. గెలిచే సీట్లు గట్టెక్కడం కష్టమేనట. సో.. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ఏ పరిస్థితుల్లో ఉందే.. ఆ పరిస్థితే బీజేపీకి వచ్చినా ఆశ్చర్యపోన్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.