Advertisementt

నిజంగా కాంగ్రెస్‌లోకి వెళ్తున్నావా రాజా?

Sun 29th Oct 2023 02:00 PM
komatireddy rajagopal reddy  నిజంగా కాంగ్రెస్‌లోకి వెళ్తున్నావా రాజా?
Is Komatireddy Rajagopal Reddy join in Congress నిజంగా కాంగ్రెస్‌లోకి వెళ్తున్నావా రాజా?
Advertisement
Ads by CJ

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏ పెద్ద తలకాయ ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పెద్ద సంఖ్యలో ముఖ్యనేతలు ‘కారు’ దిగి కాంగ్రెస్‌ గూటికి చేరిపోయారు. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటే బీఆర్ఎస్‌లో ఎలాంటి పరిస్థితి ఉందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక బీజేపీ విషయానికొస్తే.. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్‌తో.. గులాబీ పార్టీతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి కమలం పార్టీని తీసుకెళ్లారు. ఆయన్ను ఏ క్షణాన అయితే అధిష్టానం పక్కనెట్టి కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి కట్టబెట్టారో.. అప్పుడే కమలం దాదాపు వాడిపోయింది!. ఆ మరుసటి రోజు నుంచే బీజేపీ నేతల్లో అసంతృప్తి.. మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పేయడం మొదలుపెట్టారు. నాటి నుంచి నేటి వరకూ అదే పంథా కొనసాగుతోంది. ఆ మధ్య అసంతృప్తులంతా రహస్యంగా సమావేశం కావడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితా రావడంతో ఇందులో పలువురు ముఖ్యనేతల పేర్లు లేకపోవడం.. ఆశావాహుల పేర్లు అస్సలే లేకపోవడంతో రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. సరిగ్గా ఈ టైమ్‌లోనే బీజేపీ బిగ్ షాట్, మాజీ ఎమ్మెల్యే, కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి సొంతగూడైన కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్త ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.


నిజమేనా రాజా..?

కాంగ్రెస్ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్.. టక్కున గుర్తొస్తుంది. అలాంటిది గత కొంతకాలంగా అన్నదమ్ములు ఇద్దరూ చెరోదారిన నడుస్తు్న్నారు. బిజినెస్, ప్రాజెక్టు పనుల విషయంలో వేల కోట్ల రూపాయిలకు బిల్లులు రావట్లేదని.. ఇదంతా ఎందుకు ప్రశాంతంగా బీజేపీలో చేరితే జరగాల్సినవన్నీ జరుగుతాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మునుగోడు నుంచి పోటీచేయడం.. ఓడిపోవడం ఇవన్నీ జరిగాయి. ఆ మరుసటి రోజు నుంచే ఇక బీజేపీలో ఉండరని.. ఆయన కావాల్సినవి.. రావాల్సినవన్నీ అయ్యాయనే ప్రచారం మొదలైంది. ఇలా ప్రచారం, వార్తలు వచ్చిన ప్రతిసారీ ఖండించడమే అన్నదమ్ముల పనయ్యింది. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు.. అది కూడా అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో నిజంగానే రాజా సొంత గూటికి వస్తున్నారా అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది. వస్తే మంచిదేనని ముఖ్యనేతలు సైతం ఆహ్వానించారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ వేదికగా అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈయన కోరుకుంటున్న అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వడానికి కూడా అధిష్టానం రెడీ ఉందట. మునుగోడుతో పాటు హైదరాబాద్‌లో కీలక నియోజకవర్గమైన ఎల్బీనగర్‌ను కూడా పరిశీలిస్తున్నట్లుగా కోమటిరెడ్డి అనుచరులు చెబుతున్నారు.


ఖండించలేదు కానీ..!

తాజాగా వస్తున్న ఈ వార్తలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే హస్తం గూటికి చేరాలని మాత్రం ప్రజలు, అభిమానులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి అయితే ఉందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పారు. చూశారుగా.. వార్తలను ఖండించలేదు.. పార్టీ మారట్లేదు అని మాత్రం ఎక్కడా ఆయన చెప్పలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కాంగ్రెస్‌- కమ్యూనిస్టుల పొత్తుల్లో భాగంగా మునుగోడు నుంచి సీపీఐ బరిలో ఉంటే తాను పోటీ చేస్తానని రాజగోపాల్‌రెడ్డి అధిష్ఠానాన్ని కోరినట్లు తెలియవచ్చింది. లేదంటే.. తాను ఎల్‌బీ నగర్‌ నుంచి, మునుగోడులో తన సతీమణికి టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్‌కు చెప్పినట్లు సమాచారం. అయితే.. ఇందుకు బీజేపీ ఒప్పుకోలేదని టాక్ నడుస్తోంది. ఇంతవరకూ ఈ రెండు డిమాండ్స్‌పై ఎలాంటి క్లారిటీ రాకపోవడం.. మొదటి జాబితాలో తన పేరు.. కనీసం భార్య పేరు కూడా రాకపోవడంతో రాజగోపాల్ హర్ట్ అయ్యారట. అందుకే సొంతగూటికి చేరాలని కోమటిరెడ్డి ఫిక్సయ్యాడని.. ఇక్కడైతే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పినా నడుస్తుందని.. కచ్చితంగా అనుకున్న స్థానం నుంచి పోటీచేయవచ్చని రాజా భావిస్తున్నారట. ఒకవేళ ఇదే జరిగితే బీజేపీ బిగ్ షాకేనని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Is Komatireddy Rajagopal Reddy join in Congress :

Komatireddy Rajagopal reddy on go to congress news

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ