క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా నేడు పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు తలపడ్డాయి. ఇప్పటి వరకు ఈ ప్రపంచకప్‌లో అపజయం అనేది లేకుండా 8 పాయింట్లతో టాప్‌లో ఉన్న న్యూజిలాండ్, భారత్ జట్లకు ఈ మ్యాచ్.. నువ్వా? నేనా? అనే కాంపిటేషన్ మధ్య ఎంతో రసవత్తరంగా మొదలైంది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. మొదటి 10 ఓవర్లు కివీస్ జట్టుపై నిప్పులు చెరిగింది. భారత్ బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. 4 ఓవర్‌లో సిరాజ్, 9వ ఓవర్‌లో షమీ చెరో వికెట్ తీసుకోవడంతో పాటు.. మొదటి 10 ఓవర్స్ ముగిసే సమయానికి కివీస్ అత్యల్ప స్కోరుకే ఇద్దరు అగ్ర బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది.
అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రచిన్ రవీంద్ర, మరో బ్యాట్స్‌మెన్ మిచెల్‌తో కలిసి రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పడంతో.. కివీస్ జట్టు కాస్త పుంజుకుంది. వీరిద్దరు సహనంగా ఆడుతూ.. భారత్ స్పిన్ బౌలర్లను ఎదుర్కొంటూ.. స్కోరులో వేగం పెంచారు. 19 పరుగులకే 2 వికెట్స్‌ను కివీస్ కోల్పోగా.. రచిన్ రవీంద్ర, మిచెల్ బాధ్యతగా ఆడుతూ వచ్చారు. మధ్యలో ఫీల్డింగ్ దిగ్గజంగా పేరున్న రవీంద్ర జడేజా.. రచిన్ రవీంద్ర ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో.. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి రోహిత్ ఎన్నో ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. వీరిద్దరూ భయంకరంగా మారుతున్న సమయంలో మళ్లీ షమీ ఎంటరై రచిన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. 178 పరుగుల వద్ద మూడో వికెట్‌గా రచిన్ (75) అవుట్ అవడంతో.. అక్కడి నుంచి పూర్తి మ్యాచ్‌ని భారత్ బౌలర్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా చివరి 10 ఓవర్లలో భారత్ బౌలర్లు విసిరిన బంతులకు.. కివీస్ బ్యాట్స్‌మెన్ వచ్చిన వాల్లు వచ్చినట్టే వెనుదిరిగారు.
మరో వైపు మిచెల్ ఒంటరి పోరాటం చేస్తూ.. సెంచరీ (130) పూర్తి చేశాడు. ఆరంభంలో అధికంగా పరుగులిచ్చిన కుల్‌దీప్.. వెంటవెంటనే రెండు వికెట్లు తీసి.. కివీస్‌కు షాకిచ్చాడు. ఇక మిగిలిన వారిని షమీ, బుమ్రా బెంబేలెత్తించారు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. మెరుపులాంటి బంతులతో కివీస్ బ్యాట్స్‌మెన్‌ని భయపెట్టిన షమీ 5 వికెట్లు తీసుకున్నాడు. ఫామ్‌లో ఉన్న భారత్ బ్యాట్స్‌మెన్‌కు కివీస్ ఇచ్చిన 273 పరుగుల లక్ష్యాన్ని చేధించడం అంత కష్టమేమీ కాదు. అందులోనూ భారత్ ఆటగాళ్లకు ధర్మశాల పిచ్‌ల గురించి తెలియంది కాదు. గట్టిగా నిలబడితే.. న్యూజిలాండ్‌పై ఉన్న చెత్త రికార్డ్‌ను భారత్ చెరిపేయడం ఖాయం.. ఫలితం ఇంకొన్ని గంటల్లో తెలిపోతుంది కాబట్టి.. చూద్దాం.. ఏం జరుగుతుందో?