ఏపీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన ప్రజా నాయకుడు చంద్రబాబు!.. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారు.. డబ్బే సంపాదించాలని నాన్న భావిస్తే రాజకీయాలు అవసరం లేదు..! ఏనాడైనా మా అమ్మ బయటకొచ్చారా? చివరకు మా తల్లిపైనా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.. ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాలకు అమ్మ రాలేదు..! అసెంబ్లీ సాక్షిగా ఈ సైకో జగన్, అతని సైన్యం భువనేశ్వరిని అవమానించారు..! సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు నా తల్లికి తెలియదు..! ఇవీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ యంగ్ లీడర్ నారా లోకేశ్ మాట్లాడిన మాటలు. గద్గద స్వరంతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలోనే కాదు.. పలు సందర్భాల్లో నారా ఫ్యామిలీ భయపడి.. కంగారెత్తినట్లు మాట్లాడటం, ఏడ్చేయడం.. చాలానే ప్రజలు చూసే ఉంటారు. అంతేకాదండోయ్.. లైట్లు ఆర్పండి, శబ్ధాలు చేయండి.. పీకలు ఊదండి.. సంకెళ్లు అని పిలుపునివ్వడంతో టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోయిన పరిస్థితి. అసలు టీడీపీని ఎక్కడ్నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సందేహాలు పార్టీలోని కొందరు ముఖ్యనేతలకు రావడం గమనార్హం.
నవ్వుకుంటున్నారు నారా!
నారా ఫ్యామీలి, టీడీపీ నేతలు చేస్తున్న చేష్టలతో సొంత తెలుగు తమ్ముళ్లే అయోమయంలో పడిన పరిస్థితి. అధినేతను జైల్లో ఉంచినంత మాత్రాన ఎంతసేపు సింపతీ, భావోద్వేగం, కంటతడి పెట్టుకుంటూ ఉంటే ఒరిగేదేంటి..? పోనీ ప్రభుత్వాన్ని పది నిమిషాలకోసారి ప్రెస్‌మీట్లు పెట్టి తిడితే వచ్చేది ఏమైనా ఉందా..? అది కాదు కావాల్సింది.. దమ్ముండాలి.. జనాల్లోకి వెళ్లాలి.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలి.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను సమాజానికి తెలియజేసి.. ఎవరి హయాంలో ఏం చేశారనేది వివరించాలి. అంతేకాదు.. టీడీపీ మళ్లీ ఎందుకు గెలవాలి..? సైకిల్ గుర్తుకు ఎందుకు ఓటేయాలనే ఆవశ్యకతను.. అంతకుమించి అధికారంలోకి వస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి భిన్నంగా ఏమేం చేయగలం.. అనే విషయాలన్నీ స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడున్న ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోనే ఎండగట్టాలి.. అప్పుడే పార్టీ జనాల్లో నానుతుంది.. ప్రజలు కూడా ఆలోచనలో పడతారు. అంతేకానీ.. ఎంతసేపూ ఢిల్లీ, రాజమండ్రి సెంట్రల్ జైలు.. చిత్ర విచిత్ర కార్యక్రమాలు చేపడితే ఎంతసేపూ మనకోసం బాకా కొట్టే చానల్స్, వార్తా పేపర్లలో న్యూస్‌గా నిలుస్తామే తప్ప ఇసుమంత కూడా ప్రయోజనం లేదనేది ఇప్పటికైనా నారా ఫ్యామిలీ, టీడీపీ పెద్దలు తెలుసుకుంటే మంచిదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరీ ముఖ్యంగా.. టీడీపీ-జనసేన కలిసి ముందుకెళ్తూ ఏం చేయాలి..? ప్రజల్లోకి ఎలా వెళ్లాలి..? జనాలకు ఏం కావాలి.. అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలు చెప్పుకుంటూ ముందుకెళ్తే మహా మంచిదేమో మరి.
మార్చు.. మార్పు మంచిదే!
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడిపినప్పుడు.. వైఎస్ ఫ్యామిలీ ఎలా ఉన్నది..? జగన్ ఎలా ఉన్నారు..? ఏ రోజైనా మీడియా ముందుకొచ్చి ఏడవటం చూశామా..? ఎంతసేపూ పరామర్శ, పాదయాత్ర, ధర్నాలు, ర్యాలీలు.. నిరసనలతోనే ఇళ్లు, వాకిలి వదిలేసి ప్రజల్లోనే గడిపారు. జగన్ కూడా జైలు నుంచి బయటికొచ్చాక ఏ ఒక్కరోజూ సింపతీ కోసం ప్రయత్నాలు చేయలేదు.. తప్పు చేయలేదు.. అన్నీ నిదానంగా బయటపడతాయ్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు.. ఇదే మాటను అసెంబ్లీలోనూ చెప్పారు కూడా. ఆఖరికి 2014 ఎన్నికల్లో పరాజయం పాలైనప్పుడు కూడా ‘కొట్టాడు.. తీసుకున్నాం.. మా టైమ్ వస్తుంది.. అప్పుడు బలంగా కొడతాం’ అని అన్నాడే తప్ప ఎక్కడా అసంతృప్తికి లోనవ్వలేదు. ఓటమి నేర్పిన పాఠంతో మరింత కసి, ఉత్సాహంతో జనాల్లోకి పాదయాత్రతో వెళ్లడం.. కనివినీ.. చరిత్రలో చూడని విధంగా 175 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 151 సీట్లను దక్కించుకుని ‘జగన్మోహనుడు’ అనిపించుకున్నారు.. చూశారు కదా.. చేయాల్సింది ఇదీ నారా ఫ్యామిలీ.. ముఖ్యంగా లోకేష్.. ఇప్పటికైనా ఇలా ఎమోషనల్, సింపతీలు కాకుండా మొదట తమరు మారి.. జనాల్లోకి వెళ్తే మంచిది సుమీ.. మార్పు మంచిదే కదా పోయేదేముంది.. మారండి.. చంద్రబాబు బయట ఉన్నా.. జైల్లోనే ఉన్నా.. ఆయన అనుభవం, డైరెక్షన్‌లో ముందుకెళ్లండి.. బాబే ఉండనక్కర్లేదుగా.. లెట్స్ రాక్ లోకేష్.. ఆల్ ది బెస్ట్.. మీకు అంతా మంచే జరుగుతుంది.. అలాగే మీకు సలహాలు ఇచ్చే వారు చెత్త ఐడియాలు కాకుండా.. ఇంకాస్త బుర్రకు పనిపెడితే బాగుంటుందేమో..!