ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారా? ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టించి కావాల్సినంత నెగిటివిటీ మూట గట్టుకున్న జగన్.. తాజాగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఏ పథకానికి ఎంతెంత ఖర్చు చేస్తున్నారో చెప్పారు. దీంతో అసలు ఏపీ అప్పెంత లెక్క తేల్చి.. జగన్ మాటల ప్రకారం అయిన ఖర్చు ఇంతైంతే తాడేపల్లి ప్యాలెస్‌లో ఎంత పాతిపెట్టారని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో లేకుంటేనే జగన్ లక్ష కోట్లు వెనకేశారని.. అదే అధికారంలో ఉంటే ఎన్ని లక్షల కోట్లు వెనకేసి ఉంటారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రజల కోసం జగన్ పంచిపెట్టింది ఎంత..? మిగిలినది ఎంత..? అనేది లెక్కలు తీస్తున్నారు. అసలు ఆ మిగిలిందంతా ఎక్కడికి వెళ్లిందని ఆరాలు తీస్తున్నారు.
సమాధానమేదీ..!
ఇటీవల ఓ సభలో జగన్.. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం అందిస్తున్నామని ప్రకటించారు. నాలుగేళ్లలో ఈ పథకం లబ్దిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు అని స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.19,178 కోట్లు అందజేస్తున్నామని ధీమాగా అంతకుమించి గర్వంగానే ప్రకటించారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం కేవలం ఐదు నెలల్లోనే సామాజిక రంగంపై ఏకంగా రూ.68,012 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ స్పష్టంగా లెక్కగట్టి చెప్పిందని ఈనాడుకు కౌంటర్‌గా తాజాగా సాక్షి కథనాన్ని వెలువరించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మిగిలిన డబ్బు అంతా ఎక్కడికెళ్లిందయ్యా రెడ్డీ.. అంటే చలీ చప్పుడు లేదు. టీడీపీ, జనసేన అడుగుతున్న ప్రశ్నలకు కనీసం వైసీపీ నుంచి సమాధానాలు అస్సలు రావు. మిగిలిన విషయాల్లో మాత్రం తెగ కౌంటర్లు ఇవ్వడానికి మీడియా ముందుకు ఎగబడిపోతుంటారు.
లెక్కలు తీందాం రండి!
సరే.. ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలపై ఎంత ఖర్చు పెట్టినా కూడా మహా అయితే ఒక లక్ష కోట్లు పెట్టింది.. అనుకుందాం.. అదీ లేదు ఏకంగా రెండు లక్షల కోట్లు పెట్టిందనుకున్నాం మరి పది లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యింది? పోనీ పది లక్షల కోట్లు తీసుకొచ్చారు సరే.. సంక్షేమానికి పోను.. మిగిలిన ఖర్చు ఎంత? వాటిలో ఎన్ని లక్షల కోట్లు నొక్కారని విపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు మినహా జగన్ ఏపీకి చేసిందేమీ లేదు.పైగా పన్నుల రూపంలో ఎంతో కొంత దండుకుంటున్నారుగా అలాంటప్పుడు అన్ని లక్షల కోట్లు ఎలా అయ్యింది? పైగా ఏ ధైర్యంతో తిరిగి ఏపీలో వైసీపీ వస్తే ఇంతకు మించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెబుతున్నారు? అసలు ఈ అప్పంతా ఎలా తీరుస్తారు? ఎప్పటికి తీరుతుంది? సంక్షేమం పేరిట ముందు నుంచి కాస్త పడేసి పన్నుల రూపంలో పిండేస్తున్నారు. అయినా సరే అప్పు మాత్రం లక్షల కోట్లు చేస్తున్నారు? అసలు ఏపీని ఏం చేద్దామని? అని జగన్ కంకణం కట్టుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.