టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలై 40 రోజులు దాటిపోయింది. టీడీపీ నేతలు నిరసనలు తెలియజేస్తున్నారు కానీ ఉపయోగం లేదు. చివరకు ఏనాడు రాజకీయాల్లో కల్పించుకోని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆయన కోడలు బ్రహ్మణి సైతం జనాల్లోకి వచ్చారు. కానీ ప్రయోజనం శూన్యమని చెప్పలేము కానీ అనుకున్న మేర మైలేజీ అయితే రాలేదు. దీనికి కారణం లేకపోలేదు. ఇన్నాళ్ళూ చప్పట్లు.. దీపాలు.. విజిల్స్ అంటూ కాలయాపన చేశారు. వీటితో జనాల్లోకి వెళ్లడమనేది అసలు ఏమాత్రం జరగని పని. ఏదో టీవీల్లో జనం చూస్తారు ఓకే అనుకుంటారు తప్ప పట్టించుకోరు. అదే జనం దగ్గరకు వెళితే ఆ ఇంపాక్టే వేరు. ఇప్పుడు నారా భువనేశ్వరి ఒక మంచి నిర్ణయానికి వచ్చారు.
జనాల్లోకి వెళ్ళాలి.. పరామర్శ యాత్ర చేపట్టాలి.. చంద్రబాబు జైలు పాలయ్యారన్న వార్త తెలుసుకుని కొన్ని గుండెలు ఆగిపోయాయి. వారితో పాటు ప్రతి ఒక్క కుటుంబం దగ్గరకు వెళ్లాలి. నేరుగా వెళ్లి చెబితే ఫలితం ఊహించని రీతిలో ఉంటుంది. భువనేశ్వరితో పాటు కుమారుడు లోకేశ్ కూడా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం మొత్తం పర్యటించనున్నారు. భువనేశ్వరి వచ్చేసి ‘నిజం గెలవాలి’ అన్న పేరుతోనూ.. లోకేష్ వచ్చేసి ‘భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో యాత్రలు చేపట్టనున్నారు. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రలకు పార్టీ వర్గాలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి. వారానికి కనీసం రెండు ప్రాంతాలకు అయినా భువనేశ్వరి వెళ్లేలా ప్రణాళిక రచిస్తున్నారు.
నిజానికి భువనేశ్వరి ఎప్పుడో జనంలోకి వెళ్లేవారు కానీ చంద్రబాబు కేసుల్లో నిర్ణయం కోసం వేచి చూశారు. అయితే ఇవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భువనేశ్వరి ఇక మీదట జనాల్లోకి వెళ్లాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం కూడా లేకపోవడంతో జనాల్లోకి వెళ్లేందుకు ఇదే సరైన సమయమని పార్టీ సీనియర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పటి వరకూ ఒక లెక్క.. భువనేశ్వరి జనంలోకి వెళితే మరో లెక్క. ఏనాడు వ్యాపారాలు తప్ప ఆమె రాజకీయాల్లో వేలు పెట్టింది లేదు. అలాంటి భువనేశ్వరి జనాల్లోకి వెళితే వారు ఆమెను గుండెకు హత్తుకోవడం ఖాయం. ఇక మీదట టీడీపీ ప్రభంజనం కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చూడాలి భువనేశ్వరి దెబ్బ ఎలా ఉంటుందనేది. మొత్తానికి భువనేశ్వరి అయితే ఏపీ పొలిటిక్స్‌ని పక్కాగా టర్న్ చేస్తారని టాక్ నడుస్తోంది.