గతంలో అయితే తెలంగాణ జనసేన కార్యకర్తలు మొరపెట్టుకున్న విషయాన్ని అధినేత పవన్ కల్యాణ్ పెడచెవిన పెట్టారు కానీ ఈసారి కూడా అలాగే చేస్తారా? లేదంటే వారి మాట విని ఎన్నికల సమరంలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీ తెలంగాణలో ఇప్పటి వరకూ పోటీ అయితే చేయలేదు. ఈసారి మాత్రం పోటీ చేయాల్సిందేనని.. లేదంటే పార్టీ తెలంగాణలో మనుగడలో లేకుండా పోతుందని కార్యకర్తలు జనసేనాని వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఒకవేళ జనసేన పోటీలో నిలిస్తే ఎవరికి ప్లస్ అవుతుంది? ఎవరికీ మైనస్ అవుతందనేది హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ ఎన్నికలలో వెనక్కి తగ్గొద్దు ప్లీజ్ అంటూ పవన్ కళ్యాణ్ కి జనసేన తెలంగాణ నాయకులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు తమ పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పార్టీ తరుఫున పోటీ చేయదలుచుకున్న నేతలతో పవన్ భేటీ అయ్యారు. 2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ వద్దని చెప్పిన మీ మాటను గౌరవించి మిన్నకుండి పోయామన్నారు. అలాగే మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ నుంచి విరమించుకున్నామని పవన్‌కు నేతలు తెలిపారు.
ఈసారి తప్పనిసరిగా పోటీచేయవలసిందేనని ముక్త కంఠంతో అభ్యర్థులంతా కోరారు.
ఈసారి పోటీ చేయకుంటే.. తెలంగాణాలో పార్టీ ఎదుగుదలను చేతులారా పాడుచేసినట్టేనని పవన్‌కు అభ్యర్థులు తెలిపారు. నేతల అభిప్రాయాలను విన్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్ధం చేసుకోగలని, అయితే తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని పవన్ వెల్లడించారు. మరి మాటిచ్చిన ప్రకారం బీజేపీని కాదని పవన్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెడతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఏపీలో పొత్తు ప్రకటన చేసినప్పటి నుంచి బీజేపీ అధిష్టానం పవన్‌ను పిలిచి మాట్లాడిందే లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ కలవదని టాక్ నడుస్తోంది. ఒకవేళ కలుస్తామంటే ఏంటి పరిస్థితి? అయినా సరే.. బీజేపీని కాదని పవన్ తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతారా? అనేది తేలాల్సి ఉంది.