బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. చాలా షాకింగ్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు వెళుతున్నారు. ఒకవైపు గులాబీ బాస్ కథన రంగంలోకి దిగి తెగ జోష్ మీదుంటే.. వెనుక నుంచి నేతలు జంప్ అవుతున్నారు. నిన్నటికి నిన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవగా.. ఆ తరువాత కాసేపటికే మరికొందరు నేతలు.. ఆ తరువాత కూడా వలసలు కొనసాగడం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది. చివరకు మంత్రి కేటీఆర్ కల్పించుకుని ఏవేవో హామీలు గుప్పిస్తున్నా కూడా నేతలు మాత్రం ఆగడం లేదు. ఈ చేరికలు చూస్తుంటే బీఆర్ఎస్ నిలుస్తుందా? అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే
ముఖ్యంగా మహా నగరంలో పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ను నేతలు వీడుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మాదాపూర్, హఫీజ్‌పేట కార్పొరేటర్ దంపతులు జగదీశ్వర్‌గౌడ్, పూజితగౌడ్ హస్తం గూటికి చేరారు. నిజానికి ఇది బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే. తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న రెండు డివిజన్లతో పాటు.. నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లోనూ జగదీశ్వర్‌గౌడ్‌కు సత్సంబంధాలున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గతంలోనే హస్తం గూటికి చేరగా.. తాజాగా జగదీశ్వర్ గౌడ్ దంపతులు చేరడం పార్టీకి ఊహించని షాక్. ఇక ఈస్ట్ ఆనంద్‌బాగ్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక నిన్న బోథ్ ఎమ్మెల్యే బాపురావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
వజ్రేష్‌కి కలిసొచ్చే అంశం..
అటు కేసీఆర్ సభ రోజే..మేడ్చల్ నియోజక వర్గంలో బీఆర్ఎస్‌కి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. సుధీర్ రెడ్డి మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. పైగా పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆయనతో పాటు ఆయన తనయుడు జడ్పీ చైర్మన్ అయిన శరత్ చంద్రారెడ్డి సైతం బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. ఈ క్రమంలోనే నేడు సుధీర్ రెడ్డి నివాసానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సుధీర్ రెడ్డి, రేవంత్ కూడా బంధువులే కావడం గమనార్హం. మొత్తానికి తండ్రీకొడుకులు కాంగ్రెస్ గూటికి చేరడమనేది ఇప్పటికే మేడ్చల్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న వజ్రేష్ యాదవ్‌కి ప్లస్ కానుంది. సుధీర్‌రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇది వజ్రేష్‌కి కలిసొచ్చే అంశం. మొత్తానికి ఎక్కడ చూసినా చేరికలు అయితే బీభత్సంగానే జరుగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.