తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పార్టీలన్నీ తెగ హడావుడి చేస్తున్నాయి. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఓటర్లకు ఎలాగైనా గాలం వేసేందుకు పార్టీలన్నీ పోటీలు పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించేసి కొందరికి బీఫామ్‌లు కూడా అందజేయడం జరిగింది. ఇక ఆ వెంటనే మేనిఫెస్టోను కూడా వెలువరించింది. మహిళలు, రైతులతో పాటు పలు వర్గాలను తన మేనిఫెస్టోలో టార్గెట్ చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే సగం మంది అభ్యర్థులతో తొలి జాబితాను వెలువరించింది. మరి బీజేపీ ఏం చేస్తోంది? కనీసం అభ్యర్థుల జాబితా లేదు.. మేనిఫెస్టో లేదు.
అందరికీ ఇదే ఆశ్చర్యం. పార్టీలన్నీ రంగంలోకి దూకేస్తుంటే బీజేపీ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది. పైగా ఈ మధ్య నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. పార్టీని వీడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ఆధిపత్య పోరుతో పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఈ తరుణంలో అలెర్ట్ అవ్వాల్సిన బీజేపీ ఏం చేస్తోందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల రేసులో కమలం పార్టీ బాగా వెనుకబడిపోయింది. దీంతో తాజాగా ఇక ఇలాగే ఉంటే బాగోదనుకుందో ఏమో కానీ అధిష్టానం అలెర్ట్ అయిపోయింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన ఎన్నికల మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తోంది.
బీజేపీ తన మేనిఫెస్టోకు రెయిన్‌బో.. అంటే ఇంద్ర ధనుస్సుగా నామకరణం చేసేందుకు సిద్ధమువుతోంది. రెయిన్‌బోలో అన్ని రంగులు ఉన్నట్టుగానే తమ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన హామీలుంటాయని చెప్పకనే చెబుతోంది. మెయిన్‌గా మేనిఫెస్టోతో జనాల ఫోకస్‌ను తనవైపునకు తిప్పుకునేలా ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఇంద్ర ధనస్సులో ఏడు రంగులున్నట్టే ఏడు హామీలను బీజేపీ హైలైట్ చేయనుందని టాక్. అవేంటనేది తెలియరాలేదు. బీఆర్ఎస్ నుంచి పూర్తిగా కాంగ్రెస్ నుంచి దాదాపుగా రావల్సిన హామీలన్నీ వచ్చేశాయ్. వాటిని తలదన్నేలా బీజేపీ మేనిఫెస్టోను రూపొందించనుందని టాక్ నడుస్తోంది. మరి జనాన్ని బీజేపీ ఏమేరకు తన వైపునకు తిప్పుకోగలుగుతుందో చూడాలి..