మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఆయన తీసుకున్న సంచలన నిర్ణయమే ఇందుకు కారణం. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై నిరసనగా బాలినేని తన గన్ మెన్‌లను తిరిగి ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. అంతేకాదు.. అనుకున్నదే తడవుగా నేడు (మంగళవారం) ప్రభుత్వం తనకు కేటాయించిన నలుగురు గన్‌మెన్లను తిప్పి పంపించివేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే ఒంగోలులో జరిగిన ఫేక్ డాక్యుమెంట్ల స్కాం సంచలనంగా మారింది.
ఈ స్కాంలో చివరకు వైసీపీ నేతలున్నా కూడా వదిలిపెట్టొద్దని ఇప్పటికే బాలినేని పోలీసులకు తెలిపారు. ఈ స్కాంలో ఏడుగురి అరెస్ట్ చేసి పోలీసులు మమ అనిపించేశారు. అసలు దోషులను వదిలేశారంటూ బాలినేని ఆరోపిస్తూ దీనికి నిరసనగా తన గన్‌మెన్లను వెనక్కి పంపించేశారు. తన రాజకీయ జీవితంలోనే ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదంటూ ఏకంగా ప్రభుత్వంపైనే ఆయన దుమ్మెత్తిపోశారు. నిజానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్‌ను మంత్రిగా కొనసాగించి తనను మాత్రం తప్పించడాన్ని బాలినేని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు పార్టీకి దూరంగా ఉన్న ఆయనను సీఎం జగన్ పిలిపించుకుని సర్ది చెప్పారు.
అప్పటి నుంచి తిరిగి యాక్టివ్ అయ్యారు కానీ ఆయనకు వైసీపీలో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సీఎం జగన్ ఒంగోలు పర్యటన నేపథ్యంలో పోలీసులు బాలినేనిని హెలీప్యాడ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన మరోసారి పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. సొంతవాళ్లే తనను బదనాం చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే సీఎంవో అధికారులు ఆయనకు నచ్చజెప్పారు. ఇక ఇప్పుడు మరోసారి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్ల స్కాం వ్యవహారంలో ఆయన కాస్త పట్టుదలగా ఉన్నారు. బాలినేని వ్యవహార శైలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఎస్పీని కోరినా ఫలితం లేదని బాలినేని వాపోతున్నారు. ఇక ఇప్పుడు బాలినేని వ్యవహార శైలిపై పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.