కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాంటి భావోద్వేగాలూ, బెదిరింపులు, సెంటిమెంట్లకు తలొగ్గకుండా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసేసింది. ముందుగా చెప్పినట్టుగానే సీనియర్లు, జూనియర్లు అని చూడకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది. అయితే టికెట్ రాని నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీభత్సంగా టార్గెట్ చేస్తున్నారు. టికెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫస్ట్ లిస్ట్‌లో సీనియర్లు పెద్దగా ఎవరూ లేరు. వారందరికీ ఎప్పుడో టికెట్ కన్ఫర్మ్ అయిపోయాయని టాక్. వారందరినీ మినహాయించి.. మరికొందరి స్థానాలను హోల్డ్‌లో పెట్టి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
టికెట్ కన్ఫర్మ్ అయిన వారి సంగతి అటుంచితే హోల్డ్‌లో పెట్టిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తమకు టికెట్ వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు. తొలి జాబితాలో సీటు దక్కని వారిలో సీనియర్ నేతలు మధుయాష్కీ, షబ్బీర్ అలీ, మహేష్‌కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వంటి వారు ఉన్న విషయం తెలిసిందే. వాస్తవానికి వరుసగా రెండు సార్లు ఓడిపోయిన నేతలను కాంగ్రెస్ పార్టీ అసలు పరిగణలోకి తీసుకోలేదు. వారికి టికెట్ ఇవ్వొద్దని పార్టీ ముందుగానే డిసైడ్ అయ్యింది. ఈ లెక్కన రెండు సార్లు ఓటమి పాలైన నేతల్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. అందుకే వీళ్లకు టికెట్ ఆపారంటూ చర్చ జరుగుతోంది.
మిగిలిన వారి మాటేమో కానీ మధు యాష్కీకి మాత్రం టికెట్ దక్కడం కష్టమేనని తెలుస్తోంది. మధు యాష్కీ వచ్చేసి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ అక్కడ సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మాత్రం తామే ఆయనను ఓడించేందుకు కృషి చేస్తామంటున్నారు. దీంతో మధు యాష్కీ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మొదటి జాబితాలో ప్రకటించిన 55 స్థానాలు కూడా ఎలాంటి వివాదాల్లేవ్. అక్కడక్కడా ఇబ్బందులు తలెత్తాయి కానీ కేవలం అవి టీ కప్పులో తుఫాన్ లాంటివి మాత్రమే. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడమే ఇప్పుడు హస్తం పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్. బీసీలకు పెద్ద పీట వేస్తామని రేవంత్ ఇప్పటికే చెప్పారు. మరి వారికి ఏమాత్రం న్యాయం చేస్తారో చూడాలి. పైగా సీనియర్లు సైతం పార్టీపై ఒత్తిడి చేస్తున్నారు.