టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన తండ్రిని బయటకు తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. దీనికోసం దాదాపు ఆయన హస్తినలోనే గడుపుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కు జైలు పాలయ్యారు. ఇక కొడుకు తండ్రిని రక్షించుకునేందుకు ఇంటిని వీడారు. ఈ తరుణంలో ఉన్నది అత్తాకోడళ్లు నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణిలు మాత్రమే. వీరిద్దరూ అటు పార్టీని కాచుకుంటూ ఇటు ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. ఏనాడు పొలిటికల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోని అత్తాకోడళ్లు.. ఇప్పుడు పార్టీకి అంతా తామై అండగా నిలిచారు.
దీంతో పార్టీ నేతలతో పాటు కేడర్ అంతా భువనేశ్వరికి మద్దతు తెలిపేందుకు ఆమెను కలుస్తున్నారు. ఇది కూడా జగన్ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. ఆమెకు ఎక్కడ సింపథి వర్కవుట్ అయ్యి టీడీపీకి మైలేజ్ పెరుగుతుందేమోనన్న భ్రమలో వరుసబెట్టి తప్పుల మీద తప్పులు చేస్తోంది. భువనేశ్వరిని ఎవరూ కలవడానికి లేదంటూ నేడు నోటీసు జారీ చేయడం సంచలనంగా మారింది. నారా భువనేశ్వరిని కలిసేందుకు టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర నిర్వహించాలనుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పడమే కాదు.. భువనేశ్వరిని కలిసేందుకు వెళితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘చంద్రబాబుగారికి మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కెక్కడిది?’’ అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. నిజమే ఎవరిని కలవద్దంటూ ఆర్డర్స్ పాస్ చేస్తే ఎలా? ప్రజాస్వామ్యమా? లేదంటే నియంతృత్వ ప్రభుత్వంలో ఉన్నామా? అని ప్రజలు అవాక్కవుతున్నారు. ఎవరిని ఎవరైనా కలిసే హక్కుంది. దీన్ని కాదనడానికి ప్రభుత్వానికి ఏం హక్కుందని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు సైతం ప్రభుత్వం ఆడమన్నట్టు ఆడుతున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు.