ఈ ఏడాది అఖిల్ ఏజెంట్, మెగాస్టార్ భోళా శంకర్ లాంటి భారీ బడ్జెట్ మూవీస్ తెరకెక్కించి ఘోరమైన డిసాస్టర్ బారిన పడ్డారు ఏకే ఎంటర్టైన్మెంట్ అధినేత అనిల్ సుంకర. మధ్యలో సామజవరగమన హిట్ అయినా.. అది చిన్న బడ్జెట్ సినిమా కావడంతో.. ఏజెంట్, భోళా శంకర్ లతో చాలా నష్టపోయారు ఆయన. తాజాగా ఆయన నిర్మిస్తున్న సందీప్ కిషన్ ఊరుపేరు భైరవ కోన సినిమాపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టె క్రమంలో అనిల్ సుంకర మేము ఖరీదైన తప్పులు చేశామంటూ సెన్సేషనల్ గా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మేము కొన్ని ఖరీదైన తప్పులు చేసాము, ఇకపై ఇలాంటివి మరోమారు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తున్నాము. సినిమాకి VFX యొక్క నాణ్యత కోసం కావాల్సిన టైమ్ కేటాయిస్తున్నాము. అందుకే ఊరుపేరు భైరవకోన లాంటి సినిమా కోసం వీఎఫ్ఎక్స్ పూర్తయిన వెంటనే రిలీజ్ డేట్ ని ప్రకటించాలనుకుంటున్నాం. సినిమా అంచనాలను అందుకుంటుందనే నమ్మకం ఉంది. ఊరుపేరు భైరవకోన సెకండ్ సింగిల్ ని త్వరలో ప్రకటిస్తాము అంటూ అనిల్ సుంకర చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే ఖరీదైన తప్పులు అంటూ అనిల్ సుంకర మాట్లాడింది ఏజెంట్-భోళా శంకర్ రిజల్ట్స్ గురించే అని చాలామంది అనుకుంటున్నారు. అనిల్ సుంకర ఇప్పుడప్పుడే ఈ నష్టాల నుంచి కోలుకోలేకే ఊరు పేరు భైరవ కోన సినిమాని ఆపేశారంటూ వస్తున్న వార్తలపై అనిల్ ఈ రకమైన ట్వీట్ తో స్పష్టతనిచ్చారు.