ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇక అభ్యర్థుల జాబితా మొదలు ప్రచారం వరకూ అన్ని విషయాల్లోనూ అధికార బీఆర్ఎస్ పార్టీ ముందుంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్స్ బాగా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఆయన ఎలక్షన్స్‌కు సంబంధించి ఇప్పటి వరకూ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ సెంటిమెంటును అస్త్రంగా చేసుకున్నారు. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో విద్యార్థులు, మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్తగా తీసుకురాబోతున్న పథకాలను వివరించారు.
ఇక ఆ తరువాత 51 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చారు. ఇక నేటి నుంచి ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. వన్ బై వన్ కార్యక్రమాలన్నీ కేసీఆర్ చేపట్టడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది. ఈ విషయమే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 15వ తేదీన బీఫాంలు ఇవ్వడం.. అది కూడా ముందుగా 51 మందికి ఇవ్వడం.. పైగా నేటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం వంటివన్నీ కేసీఆర్ సెంటిమెంటు ప్రకారమే చేస్తున్నారట. నిన్నటి డేట్ 15. ఈ రెండు నంబర్లను కలిపితే (5+1) 6 వస్తుంది. తొలుత బీఫాంలు తీసుకున్న అభ్యర్థుల సంఖ్య 51 మంది.. దీనిని కలిపినా కూడా 5+1 అంటే 6 నంబర్ వస్తుంది. 6 అనేది కేసీఆర్ లక్కీ నంబర్. పలు సందర్భాల్లో కేసీఆర్ ఈ విషయాన్ని చెప్పారు.
కేసీఆర్ అటు బీఫామ్‌లు ఇవ్వడం.. డేటు అన్నింటినీ పరిశీలిస్తే.. కేసీఆర్ ఈ పనులన్నింటినీ తన లక్కీ నంబర్‌ను బేస్ చేసుకునే చేశారని టాక్ నడుస్తోంది. ఇక తొలి ప్రచారం నేటి నుంచే అన్నారు కదా.. దాని వెనుక ఉన్న మతలబేంటి అంటారా? కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభించాలనుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తన తొలి ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నుంచే చేపట్టారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత ఎన్నికల్లో అంటే 2018లో కూడా హుస్నాబాద్ నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ ఎన్నికల్లోనూ విజయం సాధించి రెండో సారి తెలంగాణకు సీఎం అయ్యారు. దీంతో ఈ ప్లేస్ కేసీఆర్‌కు సెంటిమెంటుగా మారింది. ఇక ఈ సారి కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టి హ్యాట్రిక్ సీఎం అవ్వాలని యోచిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.