ఇప్పుడు అటు ఏపీ.. ఇటు తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్న నేత కేటీఆర్. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎటు పడితే అటు ఫ్లిప్ అవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు తరలించిన సమయంలో తెలంగాణలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో తెలంగాణలో చంద్రబాబు విషయమై ర్యాలీలు, నిరసనలకు అనుమతించబోమని కేటీఆర్ మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణలో తీవ్ర వ్యతిరేక వచ్చింది. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకునే నేతలు ఇంత సంకుచితంగా ఆలోచించడమేంటంటూ తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్‌పై మండిపడ్డారు.
తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో కేటీఆర్ దిగొచ్చారు. కావాలని మరీ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసి ఆయనను ఆకాశానికి ఎత్తారు. రాముడు, కృష్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఎన్టీఆరేనని.. అసలు ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందన్నంతగా బిల్డప్ ఇచ్చారు. ఆయన స్ఫూర్తితోనే తన తండ్రి కేసీఆర్ తనకు తారక రామారావు అని పెట్టారని అన్నారు. సెటిలర్స్ ఓట్లతో పాటు తెలంగాణలోనూ టీడీపీకి కేడర్ ఉంది. ఈ ఓట్లన్నీ ఎక్కడ కోల్పోతామోనన్న భయంతోనే కేటీఆర్ దిగి వచ్చారని అప్పట్లో బీభత్సంగా టాక్ నడిచింది. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్ చేసిన ట్వీట్ బాధ కలిగించిందంటూ కేటీఆర్ కొత్త పల్లవి అందుకున్నారు.
కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నాం.. అని పనిలో పనిగా ఆందోళనలు వద్దన్న విషయానికి కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఉన్నట్టుండి కేటీఆర్ ఏ బోధి వృక్షం కింద కూర్చొని ఉంటారు.. ఇంతలా జ్ఞానోదయమైందని అనుకుంటున్నారా? అదేమీ లేదు. నారా లోకేష్, అమిత్ షా భేటీలో బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో బీజేపీ, టీడీపీ ఒక్కటైపోతే ఇప్పుడున్న వ్యతిరేకత చాలదన్నట్టు సెటిలర్స్, టీడీపీ కేడర్ ఓట్లు కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోతాయి.. ఇది కూడా బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బవుతుందని భావించిన కేటీఆర్ ఒక్కసారిగా నారా లోకేష్‌పై భారీగా సానుభూతిని ఒలకబోశారని టాక్.