టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఏపీ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో డీహైడ్రేషన్ కారణంగా ఆయనకు స్కిన్ అలర్జీ వచ్చింది. ఇక్కడ కూడా పెద్ద సీన్ క్రియేట్ చేసి చివరకు వైద్యులను జైలులోనికి అధికారులు అనుమతించారు. స్కిన్ అలర్జీ అని చెప్పి ఏవో మెడిసిన్ అయితే వైద్యులు ఇచ్చారు. అయితే చంద్రబాబు బరువు తగ్గిపోయారు. కానీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. అదేంటని కుటుంబ సభ్యులు ప్రశ్నిసన్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆరోగ్యంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలకు మరింత పదును పెట్టారు.
స్కిన్ అలర్జీకే ప్రాణాలు పోతాయా? అంటూ మీడియా ముందు అవాకులు చెవాకులు పేలారు. ఇంటి నుంచి ఫుడ్ వస్తున్నప్పుడు ఆయన బరువు ఎలా తగ్గుతారని ప్రశ్నించారు. బరువు తగ్గడానికి ఫుడ్ మాత్రమే కారణమా? అక్కడున్న పరిస్థితులు కారణం కాదా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు వైద్యుల రిపోర్టును ఎందుకు బయటకు రానివ్వడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఇటు టీడీపీ నేతల ఆగ్రహం.. అటు సామాన్య జనంలో చంద్రబాబు ఆరోగ్యంపై చర్చ జరుగుతుండటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గదిని వైద్యులు సిద్ధం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యులను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏమీ లేనప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసర సేవలు కేవలం స్కిన్ అలర్జీకే అందిస్తున్నారా? జైళ్ల శాఖ అధికారులు వాస్తవాలు దాచిపెడుతుందని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న ఆవేదనలో తప్పేముంది? దానిని కూడా తప్పుబడతారా? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే లైట్ తీసుకుంటారా? ఒక ఎమోషన్‌ను కూడా తప్పుబడతారా? అని సామాన్య జనం సైతం ప్రశ్నిస్తున్నారు.