రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కుంటున్నారు, ఆయన దాదాపుగా ఐదు కేజీలు తగ్గిపోయారంటూ చంద్రబాబు కుటుంభ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళ చేస్తున్నారు. ఈమేరకు తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఇలా ట్వీట్ చేసాడు.
భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారు. ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబు గారిని అనారోగ్య కారణాలతో అంతమొందించే ప్రణాళిక ఏదో రచిస్తున్నారు. చంద్రబాబు గారి ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు గారిని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో పదే పదే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయన ఆరోగ్యం, భద్రతపై పెట్టడంలేదు. చంద్రబాబు గారికి ఏ హాని జరిగినా, సైకోజగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యత.. అంటూ ట్వీట్ చేసాడు.
దానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసు.. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధకలిగించింది. కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన సమయంలో ఆయన మరో రోజు దీక్ష చేస్తే చనిపోతారని అప్పుడు డాక్టర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇదంతా ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ వ్యవహారం అని అన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేఖంగా ఆందోళనలు వద్దంటున్నాం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే తన తపన అంటూ కేటీఆర్ చంద్రబాబు ఆరోగ్యంపై, నారా లోకేష్ ట్వీట్ పై స్పందించారు.