టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక అక్కడ ఆయనకు కేటాయించిన గది.. భద్రత తదితర విషయాలపై కొన్ని మీడియా సంస్థలు కథనాల మీద కథనాలు వండి వార్చాయి. కానీ ఆయన ఆరోగ్యానికి అవసరమైన వసతులు అక్కడ ఉన్నాయా? అనే విషయంలో మాత్రం ఎలాంటి కథనాలనూ వెలువరించలేదు. ప్లస్‌లన్నీ హైలైట్ చేస్తూ ఊదరగొట్టిన ఛానళ్లు.. మైనస్‌ల జోలికి మాత్రం వెళ్లలేదు. కానీ ఆది నుంచి కూడా చంద్రబాబు కుటుంబం ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని మొత్తుకుంటూ వచ్చింది.
స్కిన్ అలర్జీతో..
ఆయన కుటుంబం అనుకున్నదంతా అయ్యింది. చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఉన్న జైలులో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. పైగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. మొత్తంగా చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. పైగా ఆయన ఐదు కిలోల బరువు తగ్గారు. మరీ ఎక్కువ తగ్గితే కిడ్నీ సంబంధిత సమస్యలు సైతం అటాక్ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం వెంటనే ఆయనకు ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విషయాన్ని జైలు అధికారులు రెండు రోజుల క్రితమే గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే డెర్మిటాలజిస్టును పంపాలంటూ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. లేఖ అందుకున్న సూపరింటెండెంట్ లక్ష్మీ సూర్యప్రభ వెంటనే ఇద్దరు డెర్మిటాలజిస్టులను చంద్రబాబు వద్దకు పంపించారు. కానీ వాళ్లను జైలులోకి అనుమతిస్తేనా?
ఆరోగ్య రీత్యా ఏసీలో ఉండాలి..
చంద్రబాబును పరీక్షించేందుకు వచ్చిన వైద్యుల వద్ద సరైన పత్రాలు లేవంటూ జైలు బయటే సిబ్బంది వారిని నిలువరించింది. ఇక లాభం లేదనుకుని సూపరింటెండెంట్ నుంచి లేఖ తీసుకొస్తే తప్ప వారిని లోపలికి వెళ్లనివ్వలేదు. చంద్రబాబుకు గడ్డం, చేతులు, ఛాతీపై దద్దుర్లను వైద్యులు గుర్తించారు. వెంటనే కొన్ని మందులను సూచించడంతో జైలు మెడికల్ సిబ్బంది చంద్రబాబుకు ఆ మెడిసిన్ అందించారు. నిజానికి చంద్రబాబుకు చర్మ సంబంధ సమస్యలు చాలా కాలంగా ఉన్నాయి. ప్రత్యేక చికిత్సతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య రీత్యా ఏసీలో ఉండాలి. కానీ జైలులో అలాంటి సౌకర్యాలేమీ లేవు. దాదాపు 35 రోజులుగా ఆయన వేడి ప్రాంతంలోనే ఉంటున్నారు. కనీసం జైలులో ఫ్యాన్లు కూడా సరిగ్గా లేవు, దీంతోనే ఆయనకు డీహైడ్రేషన్ సమస్య తలెత్తింది.
నా భర్తకు తీవ్ర ముప్పు..
ఈ క్రమంలోనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని.. ఇంకా తగ్గితే కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందన్నారు. ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించటం హృదయవిదారకమని బ్రాహ్మణి ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబుకు తక్షణ వైద్య సాయం అవసరమన్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులమంతా తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు ట్విటర్ వేదికగా నారా బ్రహ్మణి తెలిపారు.