ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికి టీడీపీ - జనసేన కలిసి పనిచేస్తాయని ఆవేశంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కామ్‌గా తన పని చేసుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో, నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉంటే.. పవన్ కళ్యాణ్ అవన్నీ పక్కనబెట్టి తన సినిమా షూటింగ్స్‌లో ఉన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే టీడీపీ-జనసేన ధ్యేయమని పౌరుషంగా మాట్లాడారు.
ఇక నిత్యం అంటే చంద్రబాబు బెయిల్ పై బయటికొచ్చేవరకు పవన్ కళ్యాణ్ లోకేష్ వెంటనే, ప్రజల్లోనే ఉంటారనుకుని జనసైనికులు కూడా సంబరపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ యధాతథం అన్నట్టుగా రాజకీయాలు పక్కనబెట్టి సినిమాల్లోకి వచ్చేశారు. కొద్దిరోజులు సినిమాలు పక్కనబెట్టి రాజకీయాల్లో చక్రం తిప్పితే పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో కాస్త నమ్మకం పెరుగుతుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ రాజకీయాలంటూ హడావిడి చేస్తేనే ఆయన మార్క్ ఏపీ రాజకీయాల్లో స్పష్టంగా కనబడుతుంది. లేదంటే ఇలా సినిమాలు, రాజకీయాలు అంటూ రెండు పడవల మీద కాళ్ళు వేస్తే వచ్చే ఎన్నికల్లోనూ కష్టమే. మరి పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి తేల్చుకుంటేనే బావుంటుంది. లేదంటే జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు ఇద్దరూ కన్ఫ్యూజ్ అవుతారు.