వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ వైఎస్సార్‌టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ నేతలంతా హాజరుకానున్నారు. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని షర్మిల నిర్ణయించారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను నేడు లేదంటే ఈ నెల17లేదా18న అభ్యర్థులు ప్రకటించారు. ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థుల ధరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ సమావేశం తర్వాత తెలంగాణలో పోటీపై షర్మిల ప్రకటన చేసే వీలుంది.
షర్మిల రెండేళ్లక్రితం వైఎస్సార్టీపీని స్థాపించారు. అయితే పార్టీకి ఆమె ఊహించిన స్థాయిలో ఆదరణ అయితే దక్కలేదు. ఆమె విషయంలో ముఖ్యంగా ప్రాంతీయతత్వం అడ్డు వచ్చింది. దీంతో షర్మిలను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకోలేకపోయారు. దీంతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పలుమార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్లకు షర్మిల.. ఆమె డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. షర్మిలకు పాలేరు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావించింది. కానీ దీనికి ఆమె ససేమిరా అన్నారు.
మొత్తానికి విలీనానికి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో షర్మిల ఒంటరిపోరుకే సిద్ధమయ్యారు. ఇక షర్మిలతో పాటు ఆమె తల్లి విజయమ్మ కూడా పోటీ చేయబోయే స్థానాలపై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. షర్మిల తన తల్లి కోసం పాలేరు స్థానాన్ని త్యాగం చేసినట్టు సమాచారం. పాలేరు నుంచి విజయమ్మ పోటీ చేయనున్నారట. ఇక షర్మిల నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి పోటీ చేయనున్నారట. నేడు జరగబోయే సమావేశంతో పోటీ అంశంపై క్లారిటీ రానుంది. మరోవైపు పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల చివరి నాటికి వైఎస్సార్‌టీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయనుంది.