గత రాత్రి పొద్దు పోయాక కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ భేటీ అయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై రెండు రోజుల సీఐడీ విచారణ ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్ అర్థరాత్రి అమిత్ షా నివాసంలో ఆయనను కలిశారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి నారా లోకేష్ తీసుకెళ్లారు. తన తండ్రితోపాటు మొత్తం కుటుంబ సభ్యులను తప్పుడు కేసులతో ఎలా వేధిస్తున్నారో షాకు వివరించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. లోకేష్, అమిత్ షాల భేటీకి సారథ్యం వహించారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పాల్గొన్నారు.
ఏం చెప్పారు..
చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి నారా లోకేష్ తీసుకెళ్లారు. చంద్రబాబును జైలు నుంచి బయటకు రాకుండా చూసేందుకు వరుసగా వివిధ కేసులు పెట్టడం.. అలాగే తనను విచారణ పేరిట ఇబ్బంది పెటట్డం గురించి వివరించినట్టు తెలుస్తోంది. చివరకు తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా దృష్టికి నారా లోకేష్ తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్‌ని అమిత్ షా అడిగినట్టు తెలుస్తోంది. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
టీడీపీ సపోర్ట్ కోసమే..
మొత్తానికి అమిత్ షా, నారా లోకేష్‌ల భేటీ చాలా పాజిటివ్‌గానే జరిగింది. మరి ఇన్ని రోజులు లేనిది.. పైగా నారా లోకేష్ నెల రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నా కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని అమిత్ షా.. ఇప్పుడు ఎందుకు ఇచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు కనీసం చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడటానికి కూడా సంశయం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు సడెన్‌గా ఎందుకు తీసుకెళ్లినట్టు? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో బీజేపీకి పక్కాగా టీడీపీ సపోర్ట్ అవసరం. కాబట్టే కిషన్‌రెడ్డి.. కల్పించుకుని నారా లోకేష్‌ను అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లారని టాక్. తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్ట్‌పై ఆందోళనలు బీభత్సంగానే సాగాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా టీడీపీకి బాగానే క్యాడర్ ఉండటంతో ఈ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ బీజేపీ కోరితే మాత్రం ఏపీలో కూడా టీడీపీతోనే కలిసి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి మున్ముందు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.