ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని తప్పించనున్నారంటూ ఓ వర్గం మీడియా బీభత్సంగా ప్రచారం చేస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ అద్భుతంగా పని చేస్తున్నారని.. కానీ ఏపీ బీజేపీ చీఫ్ సొంత పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని సదరు వర్గం మీడియా అభియోగం. తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీపై బీజేపీ అధ్యక్షురాలు మమకారం చూపిస్తోందని అది సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులకు నచ్చడం లేదట. ఇదంతా బీజేపీ అధిష్టానం అభిప్రాయం కాదు.. ఓ వర్గం మీడియా అభిప్రాయాన్ని ఇలా పార్టీకి అంటగట్టేస్తున్నారు.
నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయ్యాక అన్యాయమని మీడియా సాక్షిగా ఖండించారు. ఆ తరువాత పార్టీ సైలెంట్‌గా ఉండటంతో పురందేశ్వరి కూడా సైలెంట్ అయిపోయారు. కానీ ఆమె ఖండించిన విషయాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తోంది. అలా అనుకుంటే ప్రతి చాలా పార్టీల వారు.. ఆ మాటకొస్తే వేరే రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, సీఎంలు సైతం ఖండించారు. మరి వారు కూడా టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నట్టేనా? ఏపీ బీజేపీ నేతలెవరితోనూ పురందేశ్వరి సంప్రదించలేదట. ఎవరిని సంప్రదించాలి? ఆమె బీజేపీ రాష్ట్ర చీఫ్ కదా? పైగా ఆ తరువాత అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తూ అసలు చంద్రబాబు ఇష్యూలోనే కల్పించుకోలేదు.
పురందేశ్వరిది నియంతృత్వ ధోరణిపై అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయట. కొంపదీసి వీళ్లే చేశారా ఏంటి? పైగా బీజేపీ అధిష్టానం తలంటిందట. దగ్గరుండి చూసొచ్చినట్టుగా కథనాలు. నిజానికి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో పార్టీ నేతలు కాస్త కంట్రోల్‌లో ఉంటున్నారు. అంతకుముందు ఎవరికి వారే యమునా తీరే. సోము వీర్రాజు అధ్యక్షుడిగా గుర్తించడానికి ఏపీ బీజేపీ నేతలు చాలా కష్టపడ్డారు. పైగా ఆయన అధికార వైసీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో ఏ నిర్ణయం తీసుకున్నా.. వెంటనే అది వైసీపీకి చేరుతుందనే టాక్ కూడా ఉండేది. అసలు కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు పార్టీ వీడటానికి కూడా సోమూ వీర్రాజు వైఖరే కారణమని టాక్ నడిచింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. పార్టీలు మారడాలూ లేవు, చీఫ్‌కి వ్యతిరేకంగా చిన్న కంప్లైంట్ కూడా లేదు. కానీ ఇలాంటి రాతలతో ఓ వర్గం మీడియా పురందేశ్వరిపై తమ అక్కసునంతా వెళ్లగక్కుతోందని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.