తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. పైగా ఎన్నికలకు పెద్దగా సమయం కూడా లేదు. కేవలం 50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఏం చేసినా ఈ లోపే చేయాలి. కాబట్టి పార్టీలన్నీ తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టాయి. అసలే ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమవడంలో ముందున్న బీఆర్ఎస్ తమ అభ్యర్థులను కొద్ది రోజుల క్రితమే ప్రకటించేసింది. ఈ క్రమంలోనే తమ పార్టీకి వీస్తున్న ఎదురుగాలిని అనుకూలంగా మార్చుకోవాలి. ఫీవర్ అంటూ ఇంట్లో కూర్చుంటే ఇక కుదరదని భావించారో ఏమో కానీ గులాబీ బాస్ కథన రంగంలోకి దిగేశారట. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా వివిధ రకాల ప్లాన్స్ చేస్తున్నారట. పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టారట. ముందుగా గ్రూపులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ అభ్యర్థులకు గులాబీ బాస్ సూచించారట.
వారందరినీ ఆకట్టుకుంటే చాలు..
ఈ క్రమంలోనే సెల్ప్ హెల్ప్ గ్రూపులు, కుల సంఘాలతో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారట. గ్రూపుల వారిగా సమావేశమై వారు అడిగినంత ఇచ్చేయాలనే నిర్ణయానికి వస్తున్నారట. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు విపరీతంగా ట్రై చేస్తున్నారట. మహిళా గ్రూపులతో మాట్లాడి.. లక్షల్లో నజరానాలు ముట్టజెప్పి.. ఆ గ్రూప్‌నకు పార్టీ లీడర్‌ను ఇన్‌చార్జిగా నియమించి వారి ఓటు పక్కాగా బీఆర్ఎస్ పార్టీకే వేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని ప్లా్న్ అట. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుంటే చాలు.. వారి ఇంట్లో వాళ్ల ఓట్లు కూడా దాదాపు ఎక్కడిపోవనేది గులాబీ బాస్ ఆలోచనగా తెలుస్తోంది. దసరా లోపు ఈ గ్రూప్స్ అన్నింటితోనూ సమావేశం నిర్వహించాలని గులాబీ నేతలు భావిస్తున్నారట.
రూ.5 లక్షలు.. గ్రూప్ బిల్డింగ్ నిర్మాణం కోసం భూమి..
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో అయితే ఇప్పటికే మహిళా సంఘాలతో సమావేశం పూర్తైందని తెలుస్తోంది. ఇక వీరికైతే భారీగానే నజరానాలు ముట్టజెబుతున్నారట. ఒక్కో గ్రూపునకు సుమారు రూ.5 లక్షలతో పాటు గ్రూపు బిల్డింగ్ నిర్మాణం కోసం భూమిని కూడా కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే కుల సంఘాలతో కూడా అధికార పార్టీ నేతలు భేటీ అవ్వాలని గులాబీ బాస్ ఆదేశాలిచ్చారట. కుల సంఘాల నేతలను ఆకట్టుకుని వారి ద్వారా కులంలోని అందరి ఓట్లు బీఆర్ఎస్‌కు పడేలా చూడాలని చెప్పారట. కుల సంఘాల నేతలకు ఇక పండగే. అలాగే 17 రోజల్లో అంటే ఈ నెల 15 నుంచి నవంబరు 9 వరకూ 41 బహిరంగసభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. వీటిలో నామినేషన్లు ప్రారంభమయ్యే నాటికే సగానికి పైగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. మొత్తానికి ఈ స్కెచ్ కానీ వర్కవుట్ అయ్యిందో.. గులాబీ బాస్‌కు హ్యాట్రిక్ విజయం ఫిక్స్ అయినట్టే.