ఆంధ్రపద్రేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు.. నిర్బంధం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని సామాన్య జనానికి కూడా అర్థమవుతోంది. అసలు ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి మాట మరిచి కక్ష్యలు కార్పణ్యాలకు తెరదీశారు. అసలు ఏపీలో టీడీపీ ఆనవాళ్లే లేకుండా చేయడానికి యత్నించారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్న మాట మరిచి ఒక నియంతలా ప్రవర్తించారు. ఇక ఆరు నెలలు పోతే అధికారంలో ఉంటామో.. ఉండమోనన్న భయం పట్టుకుందో ఏమో కానీ తాను అధికార పీఠం దిగడానికి ముందే టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే సిట్‌ను ఏర్పాటు చేశారు. దాని ద్వారా తాను అనుకున్నది సాధించేశారు. ఈ విషయాన్ని న్యాయ వ్యవస్థకు సంబంధించిన ప్రముఖ పత్రిక ‘ఇండియా లీగల్’ కూడా స్పష్టం చేసింది.
రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఎంతలా ఉపయోగించుకుంటున్నారనడానికి ఇదొక నిదర్శమని ఇండియా లీగల్ వెల్లడించింది. ‘చంద్రబాబు మరో బలిపశువా’ అనే టైటిల్‌తో ప్రచురించిన కథనంలో చాలా విషయాలను ఇండియా లీగల్ ప్రస్తావించింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు అరెస్ట్ అవడమనేది కొత్తేమీ కాదని.. గతంలో చాలా మంది అరెస్ట్ అయ్యారని తెలిపింది. చంద్రబాబుపై కేసును సుప్రీంకోర్టు జాతీయాంశంగా పేర్కొనాలని కథనంలో పేర్కొంది. రాజకీయ నేతల చేతుల్లో పోలీసులు తొత్తులుగా మారారని.. ఈ క్రమంలోనే పోలీసులు మితిమీరి ప్రవర్తిస్తే కోర్టులు రంగప్రవేశం చేసిన విషయాన్ని ఇండియా లీగల్ గుర్తు చేసింది. అసలు చంద్రబాబును అరెస్ట్ చేశాక.. ఆధారాల కోసం యత్నించడమేంటని తప్పుబట్టింది.
మొత్తానికి చంద్రబాబును కావాలని రాజకీయ కక్షతో ఇరికించారని ఇండియా లీగల్ స్పష్టం చేసింది. మరో ఆసక్తికర విషయాన్ని కూడా ఇండియా లీగల్ తన కథనంలో ప్రస్తావించింది. చంద్రబాబు బీజేపీతో స్నేహంగా ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేది కాదని తెలిపింది. చంద్రబాబును రాజకీయ కక్షతోనే ఇరికించారని టీడీపీ చేస్తున్న పోరాటానికి ఈ కథనం ఊపిరిపోసింది. చంద్రబాబునే కాదు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను సైతం ఈ క్రమంలోనే ఇరికించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న లోకేష్ విచారణలో ఏం జరిగిందో ఆయన చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించి కేవలం ఒకే ఒక్క ప్రశ్న అడిగారని ఆయన తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఐఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ గురించి వచ్చిందా అంటే.. రాలేదని చెప్పానన్నారు. మొత్తానికి లోకేష్‌ను సైతం కావాలని ఇరికించేందుకు జగన్ ప్రభుత్వం యత్నిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.