తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఏపీలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం అయితే కనిపిస్తోంది. పార్టీలన్నీ పొత్తులను ఫిక్స్ చేసుకుంటున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రణాళికలకు పదును పెట్టి అమలు చేసే పనిలో ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ కూడా ఇప్పుడు ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తనలోని చాణక్యుడిని బయటకు తీశారు. నిన్న విజయవాడలో ఏపీ సీఎం జగన్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేశారు. పార్టీ శ్రేణులకు పలు కీలక సూచనలు చేశారు.
అంతా బాగానే ఉంది కానీ జగన్‌కు జనవరి గండం అయితే పొంచి ఉంది. దానిని దాటితేనే ఏమైనా చేయగలరు. జనవరి గండం ఏంటా? అంటారా? ఏపీలో మార్చిలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి దీనికి నెల ముందు అంటే ఫిబ్రవరిలో కోడ్ అమలులోకి వస్తుంది. మరి మన సీఎం ఏమైనా ఒకటి అర పథకాలు ప్రకటించారా? అన్నీ కోట్ల రూపాయల డబ్బుతో కూడుకున్నవే. పింఛన్ల పెంపుదల అది కూడా జనవరి 1 నుంచి.. డీఏ బకాయిలు, అమ్మ ఒడి అంటూ గుంపగుత్తిగా పథకాలను ప్రకటించేశారు. వీటన్నింటికీ మూలం జనవరి. మరి ఆ సమయానికి నిధులు ఎలా సమకూరుస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలే జగన్ ఏది తలపెట్టినా నిధులతో తప్ప మరొక దాని జోలికి వెళ్లరు.
ఇప్పటికే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామంటూ వాటికీ వీటికీ వేల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. పోనీ రాష్ట్రం ఏమైనా నిధులతో కళకళలాడుతోందా? అంటే నిండా అప్పుల్లో మునిగిపోయింది. ఈ సమయంలో హంగులు, ఆర్భాటాలు, జనాన్ని సోమరుల్ని చేసే పథకాలు. ఒకటేమిటీ జగన్ ప్రభుత్వం మొత్తం ఇక మీదట డబ్బు చుట్టూనే తిరగాలి. దీనికోసం మళ్లీ అప్పు చేస్తారా? లేదంటే కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకుంటారా? ఏవిధంగా సమకూర్చుకుంటారన్నది హాట్ టాపిక్. నిజానికి జగన్ అధికారంలోకి తిరిగి రావడం కోసం ప్రకటిస్తున్న పథకాలన్నీ అమలు చేస్తూ పోతే ఏపీ పరిస్థితి శ్రీలంకే. మరి చూడాలి జగన్ నిధుల కోసం ఏం చేస్తారో.. మొత్తానికి ఎన్నికలేమో కానీ దానికి ముందు జనవరిలోనే జగన్‌కు పెద్ద గండమే పొంచి ఉంది.