టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. అటు బాబు.. ఇటు సీఐడీ తరఫున వాడివేడీ వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం తదుపురి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. వాస్తవానికి ఇవాళ వాదనలతో విచారణ ముగుస్తుందని ముందు నుంచే అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ ఉదయం అంతా వాదనలు విని.. మధ్యాహ్నం ఇరువురి వాదనలను నిశితంగా పరిశిలించిన తర్వాత బుధవారం తీర్పు రావొచ్చని టీడీపీ శ్రేణులు భావించాయి కానీ.. మళ్లీ విచారణే శుక్రవారానికి వాయిదా పడిందంటే.. ఇక తీర్పు ఎప్పుడొస్తుందనేది ప్రశ్నార్థకంగానే మారింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఏం జరుగుతుందో అని ఆందోళన మొదలైంది.
సాల్వే ఏం వాదించారు..?
కాగా.. సుప్రీంకోర్టులో ఇరువర్గాల వాదనలన్నీ సెక్షన్ 17A చుట్టూ తిరిగాయి. ఉదయం అంతా చంద్రబాబు తరఫున ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వే వాదనలు పూర్తయ్యాయి. గంటపాటు హరీశ్ సాల్వే తన వాదనలు కొనసాగించారు. చంద్రబాబుకు పక్కాగా 17 ఏ వర్తిస్తుందంటూ.. ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యాన్ని సుప్రీంకోర్టుకు వివరించారు. ప్రజాప్రతినిధులపై ప్రతీకార చర్యలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం కాబట్టి ఇది చంద్రబాబుకు వర్తిస్తుందన్నారు. అలాగే ప్రజాప్రతినిధులపై పాత్రపై విచారణకు ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తప్పని సరి అని సాల్వే వాదించారు. సాల్వే వాదనల అనంతరం ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే ముకుల్ రోహత్గిపై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముచ్చటగా మూడు ప్రశ్నలు సంధించింది.
సమాధానాల్లేవ్..?
అయితే.. ధర్మాసనం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ రోహత్గి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. 17A నేరానికి వర్తిస్తుందా? నిందితులకు వర్తిస్తుందా? 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు? అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలు కాకపోతే.. మిగతా సెక్షన్ల కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా? మిగతా సెక్షన్ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా? లేదా? అని రోహత్గిని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ప్రశ్నించింది. అయితే రోహత్గి వద్ద దేనికీ సరైన సమాధానం లేదు. దీంతో జవాబు ఇవ్వకుండానే పాత వాదనలనే ఆయన వినిపించారు. ఆ తరువాత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలకు సుప్రీంకోర్టు విరామం ప్రకటించింది. విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం తర్వాత తీర్పు ఉంటుందని భావించినప్పటికీ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. మరి.. శుక్రవారం అయినా టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నట్లుగా తీర్పు వస్తుందో లేదో చూడాలి మరి.