నిన్న ఏపీ సీఎం జగన్ జగన్ విజయవాడ సభ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చేయాల్సిందంతా చేసేసి.. తనకేమి తెలియదని బొంకారు. పైగా తన అబద్ధాలను ప్రచారం చేయాలంటూ పిలుపునిచ్చారు. గురివింద తన కింద నలుపెరుగదని.. తాను చేసిన తప్పులను పక్కనబెట్టి ఎదుటి వ్యక్తిపై ఆరోపణలు చేస్తే ఎలా? నిన్న వైసీపీ ప్రతినిధుల సభలో చంద్రబాబు అరెస్ట్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎగతాళి చేస్తూనే సవరించుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన అసలు అలా ఎందుకు మాట్లాడారు? ఆ మాటల వెనుక ఆంతర్యమేంటి? ప్రతికూలతను ఎదుర్కొనే యత్నం చేశారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇంత వెటకారం ఎందుకో..!
‘నేను లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు ఎత్తారు’ అట. ఏంటీ వెటకారం? సీఎం స్థాయి వ్యక్తి పైగా అటు వైపు ఉన్నది మాజీ ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి గురించి ఇంత వెటకారమా? తన మాటల్లో వెటకారాన్ని జగన్ గ్రహించారో ఏమో కానీ వెంటనే సవరించుకునే యత్నం కూడా చేశారు. చంద్రబాబుపై తనకెలాంటి కక్షా లేదని.. అసలు కక్ష సాధింపు కోసం ఆయనను అరెస్ట్ చేయలేదని కవర్ చేసుకునే వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల్లో సగం మంది టీడీపీ వాళ్లేనన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీ చంద్రబాబు మీద విచారణలు జరిపి, ఆయన అవినీతిని నిరూపించాయన్నారు. దోషులను ఈడీ అరెస్టు కూడా చేసింది’ అని సీఎం ప్రకటించేశారు.
అబ్బో చేయాల్సింది అంతా చేసి..!
అంటే తమదేం లేదు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలే అన్నీ చేశాయని చెప్పకనే చెప్పారు. బీజేపీ ఎంపీల్లో సగం మంది టీడీపీ వాళ్లేననడంలో ఆంతర్యమేంటని జనం చర్చించుకుంటున్నారు. స్కిల్ స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని.. ప్రజాధనాన్ని దోచేసిన వాళ్లను జైల్లో కాకుండా మరెక్కడ పెట్టాలని ప్రశ్నించారు. మరి ఆయనను ఏకంగా 16 నెలల పాటు జైల్లో పెట్టిన విషయాన్ని మరిచారు. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థే విచారించి ఆయనను రూ.43 వేల కోట్ల స్కాం చేశారని జైలులో పెట్టారు. జగన్ స్కాం చేసిన సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా కూడా లేరు. ఆయనే రూ.43 వేల కోట్లు స్కాం చేస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కాం చేయాలనుకుంటే ఎంత చేయొచ్చు. కానీ కేవలం రూ.300 కోట్ల స్కాం చేస్తారా? నవ్విపోదురుగాక. పైగా తాను చెప్పిన వాటిని వైసీపీ నేతలంతా ప్రచారం చేయాలంటే సభ సాక్షిగా.. మీడియా సమక్షంలో చెప్పడం అందరినీ విస్తుబోయేలా చేసింది. మొత్తానికి చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడమే కాదు.. దానిని చెప్పుకుని మరీ జగన్ ఆనందిస్తున్నారు.