తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే బీభత్సంగా పుంజుకుంది. అధికార బీఆర్ఎస్‌నే సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. కాంగ్రెస్‌కు ఇక్కడ పరిస్థితులు అనుకూలించడంతో అధిష్టానం సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అవకాశం వస్తే చాలు వదులుకోవద్దనే భావనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు అప్పగించింది. మరోవైపు పార్టీ అగ్రనేతలు బస్సు యాత్ర చేపట్టి ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
బస్సు యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో అధినాయకత్వం బీభత్సమైన జోష్ నింపనున్నారు. ఈ నెల15 నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలో 10 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. అలంపూర్ నుంచి ప్రారంభం కానుంది. 15,16 తేదీలలో బస్సుయాత్ర ప్రియాంక గాంధీ పాల్గొననుంది. 18,19 తేదీలలో బస్సు యాత్రలో రాహుల్, 20, 21 తేదీలలో ఖర్గే.. మిగిలిన నాలుగు రోజుల్లో డీకే శివకుమార్, సిద్ధరామయ్య పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇకపోతే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. నిజానికి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
అయితే కాంగ్రెస్ పార్టీ సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తోంది కానీ అభ్యర్థుల జాబితాను మాత్రం బయటకు తీయడం లేదు. దీనికి కారణం వేరే పార్టీల అభ్యర్థులు ఎవరైనా పార్టీలోకి వస్తారేమోనని వేచి చూడటం ఒకటి కాగా.. మరింత ముఖ్యమైన కారణం ఏంటంటే.. సీఎం కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ సైతం సెంటిమెంటును ఫాలో అవడం. అక్టోబర్ 14 వరకూ మహాలయ పక్షం నడుస్తోంది. అప్పటి వరకూ ఏ మంచి పనులు చేపట్టడమూ సరికాదట. 14న అమావాస్య. ఆపై ఇక అన్నీ మంచిరోజులే. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ గిడ్యూల్ జాన్తానై.. 14 వరకూ అభ్యర్థుల జాబితాను ప్రకటించేదే లేదని కాంగ్రెస్ పార్టీ భీష్మించింది. ఈసారి మంచి రోజులు చూసుకుని మరీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో.