తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. త్వరలో జరగబోయే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల్లోని శాసన సభల కాలపరిమితి డిసెంబర్ 2023, జనవరి 2024 మధ్య ముగియనుంది. ఎన్నికల సంఘం సాధారణంగా శాసనసభ గడువు ముగియడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంటుంది.
తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు.. మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలు.. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. పార్టీలు, ప్రభుత్వాధికారులతో చర్చలు నిర్వహించిన మీదట ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు సీఈసీ వెల్లడించింది. ఐదు రాష్ట్రాల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు సీఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ వచ్చేసి డిసెంబర్ 30న జరగనుంది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలు ఎప్పుడంటే..
నవంబర్ 10 నామినేషన్లు
నవంబర్ 13న స్క్రూట్నీ
నవంబర్ 14 లోపు నామినేషన్ల విత్ డ్రా
తెలంగాణలో పోలింగ్ నవంబర్ 30 (గురువారం)
కౌంటింగ్ డిసెంబర్ 3