నేడు టీడీపీ హాట్ మండే. టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్లపై తీర్పు నేడు వెలువడనుంది. సుప్రీంకోర్టు, హైకోర్ట్, విజయవాడ ఏసీబీ కోర్ట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ ల పై తీర్పులు, విచారణ జరగనున్నాయి. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ అల్లైన్‌మెంట్ మార్పు కేసులో బెయిల్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌లపై హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఇప్పటికే ఈ మూడు కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. ఉదయం 10.30 గంటలకు హై కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
మరోవైపు నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు జాబితాలో 59 వ నంబర్ కేసుగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ లిస్ట్ అయ్యింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే లండన్ నుంచి ఢిల్లీ వచ్చారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై నేడు తీర్పు వెలువడనుంది. ఈ పిటిషన్‌లపై ఇప్పటికే పూర్తయిన వాదనలు పూర్తయ్యాయి.
హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, ముందస్తు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. మొత్తానికి చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా? రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతారా? లేదా? లేదంటే ఆయనను మరోసారి కస్టడీకి పంపిస్తారా? అనే ఉత్కంఠ సర్వత్రా సాగుతోంది. అలాగే సుప్రీంకోర్టులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 (ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు చంద్రబాబుపై దాఖలైన ఇతర కేసులపైనా ప్రభావం చూపనున్నాయి. దీంతో సోమవారం చంద్రబాబు, టీడీపీతో పాటు ఏపీ ప్రభుత్వానికి కూడా అత్యంత కీలకంగా మారనుంది.