ఏపీకి రేపు బిగ్ డే. మూడు కీలక పరిణామాలకు ఏపీలో చోటు చేసుకున్నాయి. వైసీపీ తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి రేపు ముహూర్తం ఫిక్స్ చేసింది. అలాగే టీడీపీ తమ అధినేతను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రేపు సుప్రీంకోర్టులో పోరాడనుంది. ఇక బీజేపీ పొత్తుతో కలిసి నడవాలా? లేదంటే సెపరేట్ దారి చూసుకోవాలా? అనేది రేపే నిర్ణయించనుంది. మొత్తానికి రేపు ఏపీలో ముక్కోణపు సిరీస్ జరగనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు కచ్చితంగా బయటకు వస్తారని ఆ పార్టీ చెబుతోంది. చంద్రబాబు అరెస్టై నెల రోజులు గడిచిపోయింది.ఇప్పటికీ బెయిల్ రాలేదు. కానీ రేపు ఎలాగైనా బయటకు తీసుకొస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెబుతున్నారు. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన పలు కేసుల్లో తీర్పులు రేపటికి(అక్టోబర్ 9) వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం టీడీపీకి కీలకంగా మారింది. సోమవారం అయినా చంద్రబాబుకు బయటకు వస్తారా? అనేది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు... సీఎం జగన్ రాజకీయ కుతంత్రాల నడుమ చిక్కి జైలు పాలై నెల రోజులవుతోంది. బయటకు వస్తే జగన్ మళ్లీ కేసులు పెడతారని టాక్ నడుస్తోంది. ఒక్కసారి బయటకు వస్తే.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని టీడీపీ చెబుతోంది. చూడాలి రేపు ఏం జరుగుతుందో..
బీజేపీ తమ పార్టీ రాష్ట్ర నాయకురాలు పురందేశ్వరిని ఆఘమేఘాల మీద హస్తినకు రమ్మనడంతో ఆమె బయలుదేరి వెళ్లారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో పాటు పొత్తుపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఏపీలో నెలకొన్న పరిస్థితులను పురందేశ్వరి అధిష్టానానికి వివరించనున్నారట. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని ఈ తరుణంలో టీడీపీ, జనసేనలతో కలిసి వెళితేనే బాగుంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తేనే పార్టీకి లాభం చేకూరే పరిస్థితి ఉండటంతో.. దాదాపుగా మూడు పార్టీల పొత్తు ఖరారవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ ఏపీలో ఏ గట్టున ఉండబోతోందో దాదాపు రేపు తేలే అవకాశం ఉంది.
వైనాట్ 175 లక్ష్యంగా వైసీపీ రేపు కీలక అడుగు వేయనుంది. ఈ క్రమంలోనే రేపు భారీగా పార్టీ ప్రతినిధుల సమావేశాన్ని వైసీపీ ఏర్పాటు చేసింది. మరోసారి అధికారాన్ని సాధించేందుకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కేడర్‌ను సమాయత్ం చేయనున్నారు. అసలే పరిస్థితులన్నీ వైసీపీకి కాస్త యాంటీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే పార్టీ నేతలు అనుసరించాల్సిన వైఖరిపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారట. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో పార్టీ ప్రతినిధుల సభను వైసీపీ పెద్దఎత్తున నిర్వహిస్తోంది. దాదాపు 8 వేలమందితో ఈ సభ ఉండనుందట. ఇక్కడి నుంచే జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారట. మొత్తానికి రేపు అన్ని పార్టీలకూ కీలకమే.