టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో అటు అధికార.. ఇటు విపక్షం మధ్య నలుగుతున్న అంశం ‘17ఏ’. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు మాజీ ముఖ్యమంత్రులు, బ్యూరోక్రాట్లపై కక్ష సాధింపులకు పాల్పడకుండా నివారించేందుకు అవినీతి నిరోధక చట్టాన్ని సవరించి 17ఏ సెక్షన్‌ను చేర్చడం జరిగింది. ఇది 2018 జూలైలో 17 ఏ అమలులోకి వచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అనేది అంతకు ముందు జరిగిందనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. కానీ అంతకు ముందు కూడా స్కిల్ డెవలప్‌మెంటులో అవినీతి జరిగిందంటూ రెండు కేసులు పడ్డాయి. వాటిని ఏసీబీ విచారించి అందులో స్కామ్ అంటూ ఏమీ లేదని తేల్చింది.
ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక అంటే 2019లో పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటిపై సమీక్షకు ‘సిట్’ను నియమించింది. సిట్ ఆరాలు తీసి 2021లో కొత్తగా కేసు నమోదు చేసింది. అలాంటప్పుడు 17 ఏ ఈ కేసుకు ఎందుకు వర్తించదని టీడీపీ తరుఫు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో అంశం కూడా హైలైట్ అవుతోంది. 17ఏ కింద చంద్రబాబుపై కేసు పెట్టాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు తరుఫు న్యాయవాదులు హైలైట్ చేస్తున్నారు. కానీ మళ్లీ మళ్లీ వైసీపీ ప్రభుత్వం పాడిన పాటే పాడుతోంది. చంద్రబాబు 17ఏ రావడానికి ముందే స్కామ్ చేశారని.. కాబట్టి ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదని.
అయితే అసలు చంద్రబాబు అరెస్ట్‌కు 17 ఏ వర్తించినా వర్తించకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకుంటే తప్పేంటన్న వాదనా లేకపోలేదు.దీనికి కారణం ఏంటంటే.. ప్రస్తుత ఏపీ గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్ స్వయానా న్యాయ కోవిదుడు. ఈ కేసులో డొల్లతనాన్ని ఇట్టే గ్రహించేస్తారు. ఆ వెంటనే చంద్రబాబు అరెస్ట్‌కు అనుమతి నిరాకరిస్తారనే అనుమానంతోనే గవర్నర్ వరకూ అరెస్ట్ విషయాన్ని తీసుకెళ్లలేదని ఏపీలో చర్చ నడుస్తోంది. అత్యంత కీలకమైన అయోధ్య కేసులో తీర్పు చెప్పిన ధర్మాసనంలో నజీర్ అహ్మద్ కూడా ఒకరు. ఆయన కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా 14 ఏళ్లు.. సుప్రీంకోర్టులో ఆరేళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. అంత సీనియర్ జడ్జి అయిన గవర్నర్ ముందుకు కేసును తీసుకెళ్లడమంటే చంద్రబాబు అరెస్ట్‌ను స్వయంగా తమకు తామే అడ్డుకట్ట వేయడమేనన్న గ్రహించిన వైసీపీ ప్రభుత్వం అక్కడి వరకూ వెళ్లకుండా తొక్కిపెట్టిందట. మొత్తానికి చంద్రబాబు ఎలాగైనా అరెస్ట్ చేయాలనే ధృడ సంకల్ఫంతో వైసీపీ ప్రభుత్వం చాలా కుట్రలే పన్నిందని ప్రజల అభిప్రాయం.