ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపికట్టెది మరో దారి అని.. సామెత ఉంది. నిన్న మొన్నటి వరకూ కలిసి ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు టీడీపీతో జత కట్టింది. బీజేపీ కూడా కలిసొస్తుందని భావించింది కానీ ఏదీ తేల్చకుండా ఉండిపోయింది. నిజానికి ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. సినిమాలు చేస్తే కోట్ల రూపాయల డబ్బు ఆయన అకౌంట్‌లోకి వచ్చి చేరుతుంది కానీ దానిని పక్కనబెట్టి జనానికి సేవ చేయడం కోసమని రాజకీయాల బాట పట్టారు. నిజానికి రాజకీయాల్లో నిస్వార్థం, నిజాయితీ వంటి పెద్దగా కనిపించవు. కానీ పవన్‌లో కొంతమేర అవి ఉంటాయి. అందుకే జనాలకు పవన్ బాగా కనెక్ట్ అయ్యారు.
ఒకరకంగా పవన్ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టరు. అలాగే కులాభిమానం పేరుతో ఒకరిని వెనుకేసుకు రావడం లేదు. పైగా గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుంగిపోయి రాజకీయాలను వీడింది లేదు. ఎవరి దగ్గరా తాకట్టు పెట్టిందీ లేదు. అందుకే ఆయనంటే ప్రజల్లో అభిమానం. అలాంటి పవన్ ప్రస్తుతం టీడీపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలంగా ఆయన బీజేపీతో కలిసి నడుస్తున్నారు. అయితే టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత బీజేపీ ఈ అంశంపై ఏమాత్రం స్పందించలేదు. కనీసం పవన్‌ను ఢిల్లీకి పిలిపించుకుని విషయమేంటని ఆరా తీసిందీ లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎంత సైలెంట్‌గా ఉన్నారో.. పవన్ విషయంలోనూ అంతే సైలెన్స్.
తాజాగా ఏపీ సీఎం జగన్‌ను ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందన్న విషయాలైతే బయటకు రాలేదు కానీ బీజేపీ ఏమైనా వైసీపీకి సపోర్టుగా నిలుస్తుందా? అనే చర్చ అయితే సర్వత్రా జరుగుతోంది. ఇప్పటి వరకూ జనసేనానికి బాసటగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే.. జనసేన, టీడీపీల నుంచి బీజేపీ వేరైనట్టేనన్న టాక్ నడుస్తోంది. నిజానికి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ పక్కనుంటే బాగుంటుందని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది కానీ నిజానికి ఏపీలో బీజేపీకి ఏమాత్రం క్యాడర్ లేదు. ఏదో ఒక పార్టీ సపోర్ట్‌తో ఎన్నికలకు వెళ్లకుంటే దాదాపు ఆ పార్టీ నేతలెవరికీ డిపాజిట్లు కూడా దొరకవు. అలాంటి పరిస్థితిలో ఉన్న బీజేపీ పయనం ఎటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.