ఏపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరిగి హస్తినకు పయనమయ్యారు. 21 రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి వెళ్లి ములాఖత్ అయ్యారు. ఆ తరువాత నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ 21 రోజుల పాటు గడిపారు. తండ్రిని బయటకు తీసుకొచ్చేందుకు పలువురు న్యాయవాదులతో భేటీ అయ్యారు. తన తండ్రిని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చేందుకు నారా లోకేష్ శత విధాలుగా యత్నిస్తున్నారు. గల్లీ నుంచి డిల్లీ వరకూ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఢిల్లీలో ఉంటూనే ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో టచ్‌లో ఉంటున్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ.. కార్యాచరణను సూచిస్తున్నారు.
జాతీయ మీడియాతో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఏపీ పరిణామాలను దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లడాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ అధికార పక్షం నానా యాగీ చేస్తోంది. టీడీపీ శ్రేణులను నిరాశపరిచారంటూ కథనాలను వండి వారుస్తోంది. ఇప్పటికే లోకేష్ అరెస్ట్ వార్తల నడుమ పారిపోయాడంటూ వైసీపీ ప్రచారం చేసింది. దీంతో ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ తాను ఎక్కడ ఉన్నది అడ్రస్‌తో సహా చెప్పి గట్టి కౌంటరే ఇచ్చారు. అంతేకాదు.. ఆయన భయపడుతున్నాడని జరుగుతున్న ప్రచారాన్ని ఛేదిస్తూ ఏపీకి తిరిగి వచ్చారు. ఆ మరుసటిరోజే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు.
సుమారు 45 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ భేటీలో చాలా విషయాల్లో నారా లోకేష్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారట. పైగా ఈ నెల 9న సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ క్రమంలోనే ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లాలని భావించారు. మరోవైప ఏపీ సీఎం జగన్ హస్తినకు వెళ్లి కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. నేడు జగన్ తిరిగి విజయవాడకు వస్తుండగా.. నారా లోకేష్ హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. శనివారం మధ్యాహ్నం రాజమండ్రి నుంచి ఢిల్లీకి లోకేష్ పయనమయ్యారు. సోమవారం చంద్రబాబు కేసు ముగిసిన వెంటనే ఢిల్లీ నుంచి పదో తేదీన విజయవాడకు రానున్నారు. అదే రోజున విజయవాడలోని సీఐడీ ఎదుట విచారణకు నారా లోకేష్ హాజరు కానున్నారు.